ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. తీవ్రమైన బొగ్గు కొరత, కీలక వ్యవస్థలకు 24 గంటల కరెంట్‌ కష్టమే!

29 Apr, 2022 17:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం డేంజర్స్ బెల్స్ మోగిస్తోంది. హీట్‌ వేవ్‌ కారణంగా దేశరాజధానిలో విద్యుత్ డిమాండ్‌ తారాస్థాయికి చేరడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మెట్రో, హాస్పిటల్స్‌ వంటి కీలక వ్యవస్థలకూ నిరంతర విద్యుత్ అందించడం సాధ్యంకాదని ప్రభుత్వం హెచ్చరించింది. బొగ్గు కొరత కారణంగా దాద్రీ-2, ఊంచహార్ పవర్ స్టేషన్స్‌ నుంచి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని... ఇది ఇలాగే కొనసాగితే, ఢిల్లీ మెట్రోతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్‌, ఇతర కార్యాలయాలకు 24 గంటలు విద్యుత్‌ అందించడం కుదరదని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టంచేసింది. 

విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు బొగ్గు సరఫరా కోసం ఢిల్లీ సర్కార్‌ కేంద్రం తలుపు తట్టింది. తక్షణమే బొగ్గు సరఫరా పెంచాలంటూ ఈమేరకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ విద్యుత్ అవసరాల్లో 25 నుంచి 30శాతం థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచే వస్తోందని వివరించారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వ వినతిమేరకు ఢిల్లీకి బొగ్గు సరఫరాను పెంచేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినట్లు భారత రైల్వే వెల్లడించింది. 
చదవండి👉🏻పంజాబ్‌: శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు, వీడియోలు వైరల్‌

ఫుల్‌ డిమాండ్‌ 
ఏప్రిల్ నెలలో తొలిసారిగా రోజువారీ పవర్ డిమాండ్ 6వేల మెగావాట్ల మార్క్‌ను టచ్ చేసింది. తగినంత బొగ్గు నిల్వలు లేకపోవడంతో .. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే దాద్రీ -2 పవర్‌ స్టేషన్‌లో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దాద్రీ-2 నుంచి ఢిల్లీకి 1751 మెగావాట్ల విద్యుత్‌ అందుతోంది. ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోతే ఢిల్లీలో బ్లాకౌట్ కావడం ఖాయం అంటున్నారు నిపుణులు.
చదవండి👉🏼 పెట్రోల్‌ ధరలు చాలా తక్కువ పెంచాం: కేంద్ర మంత్రి

మరిన్ని వార్తలు