Coal Crisis In India: బొగ్గు సంక్షోభంలో భారత్‌ 

9 Oct, 2021 07:10 IST|Sakshi

దేశంలోని 16 ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోగా ప్రమాదంలో అనేక కేంద్రాలు

కష్టాల్లో రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు

సరిపడా నిల్వలు లేక ఉత్పత్తికి ఇబ్బందులు

బొగ్గు కొరతతో రాష్ట్రానికి పెరిగిన విద్యుత్‌ కొనుగోలు ఖర్చులు

యూనిట్‌కు రూ.6 నుంచి రూ.20 వరకూ చెల్లిస్తున్న ఏపీ ట్రాన్స్‌కో

ఏపీ జెన్‌కోకు గుదిబండగా మారిన బకాయిల భారం

సాక్షి, అమరావతి : దేశంలో బొగ్గు సంక్షోభం ఏర్పడుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తదనంతరం పారిశ్రామిక రంగంలో విద్యుత్‌ డిమాండ్‌ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌పైనా, మన రాష్ట్రంపైనా పడుతోంది. 

దేశవ్యాప్తంగా ఇదీ పరిస్థితి..
పారిశ్రామిక, గృహ అవసరాల కోసం దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో సింహభాగం థర్మల్‌ కేంద్రాల నుంచే వస్తోంది. ఎన్టీపీసీ, టాటా పవర్, టొరెంట్‌ పవర్‌ ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిన్నా పెద్దా అన్నీ కలిపి 135 థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఉండగా అవన్నీ ఇప్పుడు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. అసలు దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70శాతం.

వీటిలో ఇప్పటికే 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయి మూతపడ్డాయి. అంటే 16,880 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. 30 ప్లాంట్లలోని నిల్వలు కేవలం ఒక రోజులో అయిపోతాయి. దీంతో 37,345 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. 18 ప్లాంట్లు రెండు రోజుల్లోనూ, 19 ప్లాంట్లు 3 రోజుల్లోనూ, 9 ప్లాంట్లు నాలుగు రోజుల్లోనూ, 6 ప్లాంట్లు 5 రోజుల్లోనూ, 10 ప్లాంట్లు ఆరు రోజుల్లోనూ, ఒక ప్లాంటు ఏడు రోజుల్లోనూ బొగ్గు సరఫరా జరగకపోతే మూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ మూతపడితే దేశవ్యాప్తంగా 1,36,159 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోతుంది. 

చదవండి: (కేంద్రమే అప్పుల ఊబిలో.. రాష్ట్రానికి ఏమిస్తది?)

బొగ్గు ధరలకు రెక్కలు
కరోనా సెకండ్‌ వేవ్‌ తరువాత, దేశంలోని పారిశ్రామిక రంగంలో విద్యుత్‌ డిమాండ్‌ బాగా పెరిగింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో అంటే దాదాపు నలభై శాతం పెరిగాయి. ఇక దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో 80శాతం వాటా కలిగిన కోల్‌ ఇండియా.. ప్రపంచ బొగ్గు ధరల్లో పెరుగుదల కారణంగా, దేశీయ బొగ్గు ఉత్పత్తిపై తాము ఆధారపడాల్సి వస్తోందని వెల్లడించింది. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో టాప్‌–2 దేశాలైన భారత్, చైనాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కొద్దిరోజుల్లోనే మన దేశం అసాధారణ విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయం. అదే జరిగితే విద్యుత్‌తో ముడిపడి ఉన్న అన్ని రకాల వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాక.. విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. బొగ్గు ఉత్పత్తిని కనీసం 10–18 శాతానికి పెంచాలని కోల్‌ ఇండియా నిర్ణయించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది.

రాష్ఠ్రంలో తగ్గిన బొగ్గు నిల్వలు.. పెరిగిన విద్యుత్‌ కొనుగోలు ధరలు
ఒకసారి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి మొదలుపెడితే కనీసం వారం రోజులైనా ఆపకుండా నడపాలి. కానీ ఏపీలోని థర్మల్‌ కేంద్రాల్లో అందుకు తగినట్టు నిల్వల్లేవని సాక్షాత్తూ సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రధాన థర్మల్‌ కేంద్రాలైన డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టీటీపీఎస్‌), రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టీపీపీ), శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎస్‌డీఎస్‌టిపీఎస్‌–కృష్ణపట్నం)లు మొత్తం 5,010 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. వీటిలో.. విజయవాడ ఎన్‌టీటీపీఎస్‌కు రోజుకి 24,600 టన్నుల బొగ్గు కావాలి. ప్రస్తుతం ఇక్కడ 13,600 టన్నులే నిల్వ ఉంది. ఆర్‌టీపీపీకి రోజుకు 16,800 టన్నులు అవసరం కాగా, ఇక్కడ 69,100 టన్నుల నిల్వ (4 రోజులకు సరిపడా) మాత్రమే ఉంది. ఇక దామోదరం సంజీవయ్య పవర్‌ స్టేషన్‌కి రోజుకు 13,600 టన్నులు కావాలి. ఇక్కడ మాత్రమే 89,200  టన్నులు (7 రోజులకు సరిపడా) నిల్వ ఉంది. ఇలా బొగ్గు కొరత ఏర్పడడంతో మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు ధరలు అమాంతం పెరిగాయి. కేవలం రూ.4 లేదా రూ.5కు వచ్చే యూనిట్‌ విద్యుత్‌కు ఇప్పుడు దాదాపు రూ.6 నుంచి పీక్‌ అవర్స్‌లో రూ.20 వరకూ వెచ్చించాల్సి వస్తోంది. 

చదవండి: (కోస్తాంధ్రకు మరో తుపాను!)

గుదిబండలా బకాయిలు
పవర్‌ ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి మొదలుపెడితే రోజంతా దాని నుంచి విద్యుత్‌ తీసుకోవాలి. కానీ, మనకు రోజంతా అవసరం ఉండదు. అలాగని ఉత్పత్తి ఆపేయాలంటే దానికి 18 గంటలు సమయం పడుతుంది. అందుకే ఒకసారి మొదలుపెడితే కనీసం వారం రోజులు నడపాలి. దానికి సరిపడా బొగ్గులేదు. ఇక ఏపీ జెన్‌కోకు బకాయిలు గుదిబండగా మారాయి. తెలంగాణ నుంచే రూ.6,200 కోట్లు ఏపీ జెన్‌కోకు రావాలి. బొగ్గు సరఫరా చేస్తున్న మైనింగ్‌ సంస్థలకు మన జెన్‌కో రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించాలి. అదంతా కడితే తప్ప వారు పూర్తిస్థాయిలో సరఫరా చేయరు. దీనికి తోడు ఇప్పుడు బొగ్గు కొరత ఏర్పడింది.
– నాగులాపల్లి శ్రీకాంత్, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి  

మరిన్ని వార్తలు