ఈసారి వణుకుడే..

31 Oct, 2021 03:05 IST|Sakshi

అప్పుడే చలి మొదలైంది. అయితే ఇది జస్ట్‌ శాంపిలే.. మున్ముందు జనమంతా గజగజ వణికిపోక తప్పదట. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని,మంచు కురిసే అవకాశమూ ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీనంతటికీ లానినా పరిస్థితి కారణమని అంటున్నారు. మరి లానినా ఏంటి, చలి విపరీతంగా పెరగడం ఏమిటి, దీనికి దానికి లంకె ఏమిటో తెలుసుకుందామా?   
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

ఇప్పటిదాకా భారీ వర్షాలు.. 
సాధారణంగా ఎల్‌నినో, లానినా పరిస్థితులు ఏర్పడినప్పుడు మన దేశంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజన్లలో గణనీయంగా మార్పులు వస్తాయి. ఈసారి లానినా కారణంగా నైరుతి రుతు పవనాలు ఎక్కువకాలం కొనసాగాయి. 1975 త ర్వాత ఇంత సుదీర్ఘంగా నైరుతి సీజన్‌ ఉండటం ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. 

మన దేశానికి సంబంధించినంత వరకు.. ఎల్‌నినో సమయంలో ఏ సీజన్‌ అయినా కూడా ఉష్ణోగ్రతలు పెరగడం, వానలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది. లానినా సమయంలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా.. వానాకాలంలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. 

పసిఫిక్‌ మహా సముద్రంపై రెండేళ్లుగా లానినా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది దాని ప్రభావం మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదయ్యాయి. తర్వాత వానాకాలం మొదలైనప్పటి నుంచీ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాల్లో అక్కడక్కడా ఇప్పటికీ భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. 

ఇక చలిచలిగా.. 
లానినా కారణంగా పసిఫిక్‌ మహా సముద్రం వైపు నుంచి శీతల గాలులు వీస్తాయని.. దీనితో భూమి ఉత్తర అర్ధభాగంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)’ తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండంలో దిగువభాగంలోని దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది.

దాని ప్రకారం.. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలపై లానినా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఇప్పటికే ఉత్తర భారత ప్రాంతంలో చలి మొదలైందని.. చాలా ప్రాంతాల్లో మూడు డిగ్రీల సెల్సియస్‌ దాకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 

ముఖ్యంగా డిసెంబర్‌ మూడో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు చలి విపరీతంగా ఉంటుందని పేర్కొంది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురవడం మొదలైందని తెలిపింది. దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ సాధారణంతో పోలిస్తే.. మూడు నుంచి ఐదు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.  
చైనాలోని తూర్పు ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోయాయని.. జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోనూ చలి తీవ్రత మొదలైందని.. ఆయా దేశాల వాతావరణ అధికారులు ప్రకటించడం గమనార్హం. 

ఏమిటీ ఎల్‌నినో, లానినా? 
భూమ్మీద అతిపెద్ద మహా సముద్రమైన పసిఫిక్‌ సముద్రం ఉపరితలంలోని నీటి ఉష్ణోగ్రతల్లో కొన్నేళ్లకోసారి హెచ్చుతగ్గులు వస్తుంటాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాల్లో.. ఖండాల మీదుగా వీచే పవనాల (గాలుల) ఉష్ణోగ్రతలు, తేమ శాతంలో మార్పులు వస్తాయి. పసిఫిక్‌ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్‌నినోగా.. తగ్గడాన్ని లానినాగా పిలుస్తారు. ఈ రెండు కూడా పసిఫిక్‌ మహా సముద్రం చుట్టూ ఉన్న వేర్వేరు ప్రాంతాలపై ఒకదానికొకటి వేర్వేరుగా, వ్యతిరేక ప్రభావం చూపుతాయి. 

ఉదాహరణకు ఎల్‌నినోతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే.. మరికొన్నిచోట్ల వానలు తగ్గి, ఎండలు పెరిగి కరువులు ఏర్పడతాయి. 
అదే లానినా వచ్చినప్పుడు దీనికి వ్యతిరేకంగా.. ఎల్‌నినోతో వరదలు వచ్చే చోట కరువులు వస్తాయి, ఎండలు ఉండే చోట భారీ వర్షాలు కురుస్తాయి.  

ఓ వైపు కరువు.. మరోవైపు వరదలు 
లానినా కారణంగా దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, ఈక్వెడార్‌ వంటి దేశాల్లో తీవ్ర కరువు పరిస్థి తులు ఏర్పడ్డాయి. పసిఫిక్‌ మహా సముద్రానికి పశ్చి మాన ఉన్న దేశాల్లో, హిందూ మహాసముద్ర ప్రాంతదేశాల్లో ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో మంచి వర్షాలు కురిశాయి. 

ప్రస్తుతం అమెరికాలో వానాకాలం మొదలైంది. లానినా ప్రభావం కారణంగా ఈసారి భారీ వర్షాలు కురుస్తాయని, తుపానులు వస్తాయని, తర్వాత చలికాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవచ్చని ఆ దేశ వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది.   

మరిన్ని వార్తలు