Odisha: గుర్తుపెట్టుకోండి.. నో మ్యాగీ.. ఓన్లీ రాగి!

11 Nov, 2022 17:32 IST|Sakshi

రాయగడ(భువనేశ్వర్‌): అధిక పౌష్టిక విలువలు ఉన్న రాగులు ప్రతిఒక్కరూ తమ నిత్య జీవన ఆహారంలో భాగంగా తీసుకోవాలని, ఇతర చిల్లర తిండికి స్వస్తి పలకాలని కలెక్టర్‌ స్వాధాదేవ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో చిరు ధాన్యాల దినోత్సవాన్ని జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రాగులతో తయారు చేసే వివిధ మిఠాయి పదార్థాలు, పిండివంటల స్టాల్స్‌ను ప్రారంభించారు.

జిల్లాలోని వివిధ స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు స్టాల్స్‌లో రాగులతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శనలో పెట్టారు. వీటిలో కొన్ని వంటకాలను రుచిచూసిన కలెక్టర్‌.. అబ్బురపడ్డారు. రాగులతో ఇన్ని రకాల వంటకాలు తయారు చేసుకొవచ్చా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసీల ముఖ్య ఆహారం రాగులని, వాటిలో పౌష్టిక విలువలు చాలా ఎక్కువగా ఉండటంతో నిత్య జీవనంలో భాగంగా చేర్చుకునే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామచంద్ర దాస్, సిబ్బంది పాల్గొన్నారు. 

చిరు ధాన్యాలకు ప్రభుత్వం ప్రోత్సాహం 
పర్లాకిమిడి: జిల్లా కేంద్రంలోని బిజూ పట్నాయక్‌ కల్యాణ మండపంలో జరిగని కార్యక్రమాన్ని కలెక్టర్‌ లింగరాజ్‌ పండా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. రాగిపిండితో తయారుచేసిన పదార్థాల స్టాల్స్‌ను పరిశీలించి, గిరిజన రైతులతో మాట్లాడారు. రాగులు, జొన్నలతో చేసిన జావ, మిక్చర్, బిస్కెట్లు డయాబెటిస్‌ రోగులకు దివ్య ఔషధమని తెలిపారు. జిల్లాలోని కాశీనగర్, నువాగడ బ్లాక్‌లలో రైతులు ఎక్కువుగా చోడి పండిస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో రాగిపంట స్కీం అధికారి సంఘమిత్ర ప్రధాన్, జిల్లా వాటర్‌షెడ్‌ పథకాల అధికారి సంతోష్‌కుమార్‌ పట్నాయక్, జిల్లా ప్రాణిచికిత్స ముఖ్య అధికారి గిరీష్‌ మహంతి, వ్యవసాయ అధికారి కైలాస్‌చంద్ర బెహరా తదిరులు పాల్గొన్నారు.  

చోడి ఉత్పత్తిలో ప్రథమం..
జయపురం: నో మ్యాగీ ఓన్లీ రాగి అనే నినాదం ప్రజల చెంతకు చేరాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండియ దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సింహాచల మిశ్రా అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్‌ రెడ్‌క్రాస్‌ కార్యదర్శి యజ్ఞేశ్వర పండా మాట్లాడారు. చోడి ఉత్పత్తిలో కొరాపుట్‌ జిల్లా రాష్ట్రంలో మొదఠి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వరంజన్‌ గౌఢ, ప్రకాశచంద్ర పట్నాయక్, ప్రభాత్‌కుమార్‌ రథ్, సాగరిక పాత్రొ, సువర్ణకుమారి ఖిళో తదితరులు పాల్గొన్నారు.

చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ

మరిన్ని వార్తలు