సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులు

19 Aug, 2021 04:46 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం సిఫార్సు

తొలి మహిళా సీజేఐ కానున్న జస్టిస్‌ బీవీ నాగరత్న

జాబితాలో సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లికి పదోన్నతి

సాక్షి, న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్‌ నుంచి ఒకరు ఉన్నారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి బేలా త్రివేది, బార్‌ నుంచి సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

వీరిలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ బీవీ నాగరత్న, సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ ఏఎం ఖాన్వీల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమైంది. కొలీజియం చేసిన సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను బుధవారం రాత్రి అధికారికంగా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి 21 నెలల తర్వాత కొలీజియం సమావేశమైంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 25 మంది ఉన్నారు. బుధవారం జస్టిస్‌ నవీన్‌ సిన్హా పదవీ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య 10కి చేరింది.  కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదిస్తే న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది.  

మొదటిసారి ముగ్గురు మహిళలు
ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతుండడం ఇదే తొలిసారి. వీరి నియామకం తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు చేరనుంది. ప్రస్తుతం జస్టిస్‌ ఇందిరా బెనర్జీ ఒక్కరే ఉన్నారు. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా కేవలం ఎనిమిది మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు. 1989లో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టులో నియమితురాలైన తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు.

కాబోయే తొలి మహిళా సీజేఐ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) తొలిసారిగా ఒక మహిళా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న 2027లో సీజేఐ కానున్నారు. ఆమె 1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్‌స్టిట్యూషనల్‌ లా, కమర్షియల్‌ లా, బీమా, సేవలు, కుటుంబ చట్టాలు, ఆర్బిట్రేషన్‌లకు సంబంధించి కేసుల్లో మంచి పేరు సంపాదించారు. కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2008 ఫిబ్రవరి 18న నియమితులైన జస్టిస్‌ బీవీ నాగరత్న 2010 ఫిబ్రవరి 17న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ ఎనగలగుప్పే వెంకటరామయ్య కుమార్తె జస్టిస్‌ బీవీ నాగరత్న. ‘‘ఏదైనా బ్రాడ్‌కాస్టింగ్‌ చానల్‌ నిజాయితీగా వార్తలు ప్రసారం చేయాలని భావించినప్పుడు ఫ్లాష్‌ న్యూస్, బ్రేకింగ్‌ న్యూస్‌లతో సంచలనాలను నిలిపివేయాలి’’ అని 2012లో ఓ కేసు విషయంలో జస్టిస్‌ నాగరత్న వ్యాఖ్యానించారు.

బార్‌ నుంచి తొమ్మిదో న్యాయవాది

కొలీజియం సిఫార్సు చేసిన సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ బార్‌ నుంచి న్యాయమూర్తి అవుతున్న తొమ్మిదో వారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కూడా బార్‌ నుంచి నియమితులైన వారే. కృష్ణా జిల్లా గణపవరానికి చెందిన ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.కోదండరామయ్య కుమారుడు పీఎస్‌ నరసింహ. ఆయన హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశారు. యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులైన ఆయన పదవీ కాలం పూర్తికాక ముందే రాజీనామా చేశారు.

అయోధ్య కేసులో రాంలల్లా విరాజ్‌మాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మహంత్‌ రామచంద్రదాస్‌ తరఫున పీఎస్‌ నరసింహ వాదనలు వినిపించారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. బీసీసీఐ కార్యకలాపాల్లో భారీ మార్పులకు అమికస్‌ క్యూరీగా సేవలందించారు. బార్‌ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి న్యాయవాది జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ కూడా 13వ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారీమన్‌ కూడా 2014లో బార్‌ నుంచి సుప్రీం కోర్టు న్యాయయూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్‌ యు.యు.లలిత్, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కూడా బార్‌ నుంచి నియమితులైన వారే.  

నాలుగో తరం న్యాయవాది

తమ పూర్వీకుల పరంపరను కొనసాగిస్తూ నాలుగో తరంలో న్యాయవాది వృత్తి చేపట్టారు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌. గుజరాత్‌లోని కౌశంబి జిల్లాకు చెందిన ఆయన అలహాబాద్‌ హైకోర్టులో 17 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2004లో అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 సెప్టెంబరు 10న గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గతంలో ఒకసారి సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా కోర్టు కార్యకలాపాలు చేపట్టి లైవ్‌ స్ట్రీమ్‌కు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ నాంది పలికారు.

జస్టిస్‌ హిమా కోహ్లి ప్రస్థానం

జస్టిస్‌ హిమా కోహ్లి 1959 సెప్టెంబర్‌ 2న ఢిల్లీలో జన్మించారు. 1984లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ సభ్యురాలయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1999 నుంచి 2004 వరకూ న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి సహా పలు విభాగాలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయ సేవల కమిటీలో పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ హిమా కోహ్లి 2007 ఆగస్టు 29న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 జనవరి 7న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పోందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైతే 2024 సెప్టెంబర్‌ వరకు సేవలు అందించనున్నారు.  

మరిన్ని వార్తలు