మావోయిస్టుల్లారా.. లొంగిపోండి: డీజీపీ పిలుపు

17 May, 2021 10:25 IST|Sakshi

జయపురం: ఉద్యమం వీడి జనస్రవంతిలో కలిసిపోవాలని రాష్ట్ర డీజీపీ అభయ్‌ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన నవరంగపూర్‌ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతలపై సు«దీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్యంగా ఒడిశా–ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల చర్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. అలాగే మావోయిస్టుల దుశ్చర్యల కట్టడికి చేపట్టాల్సిన పలు వ్యూహాలను అధికారులకు వివరించారు.

అనంతరం జిల్లాలోని ఆదర్శ పోలీస్‌స్టేషన్, రిజర్వ్‌ పోలీస్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఆయా ప్రాంతాల జవానులు, పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన కరోనా కష్టకాల పరిస్థితులతో భయాందోళనలో ఉన్న ప్రజలను మరింత భీతి కలిగించవద్దని మావోయిస్టులకు సూచించారు. ప్రజలంతా ప్రస్తుతం బాగానే ఉన్నారని, దీనిని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా లొంగిపోవాలని మావోయిస్టులను కోరారు. తమ వద్దకు వచ్చిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలన్నీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో ఆయనతో పాటు నవరంగపూర్‌ ఎస్పీ ప్రహ్లాద్‌ సహాయి మీనా, విజిలెన్స్‌ విభాగం డైరెక్టర్‌ ఆర్‌.కె.శర్మ, నవరంగపూర్‌ తహసీల్దారు రవీంద్రకుమార్‌ రౌత్, పట్టణ పోలీస్‌ అధికారి తారిక్‌ అహ్మద్‌ ఉన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు