శివసేన నేత దారుణ హత్య.. నిందితుడి కారులో కమెడియన్‌ ఫోటో!

5 Nov, 2022 11:03 IST|Sakshi

పంజాబ్‌కు చెందిన శివనేత నేత సుధీర్ సూరి శుక్రవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సుధీర్‌ను కాల్చి చంపిన నిందితుడిని సంఘటన స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన ఏ30 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సందీప్‌ సింగ్‌ అలియాస్‌ సన్నీగా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే బట్టల దుకాణం నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

సందీప్‌ తన దగ్గర ఉన్న లైసెన్స్‌ తుపాకీతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేగాక అతని కారులో బాలీవుడ్‌ కమెడియన్‌ భారతీ సింగ్‌, ఆల్‌ ఇండియా యాంటీ టెర్రరిస్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ మణిందర్జీత్‌ సింగ్‌ బిట్టా ఫోటోలు లభించినట్లు పంజాబ్‌ పోలీసులు తెలిపారు. కాగా అమృత్‌సర్‌ నగరంలోని గోపాల్‌ దేవాలయం ఎదుట నిరసన చేస్తున్న శివసేన నేత సుధీర్‌ సూరిపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిన విషయం తెలిసిందే.

తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే శివసేన నేత సుధీర్‌ చుట్టూ భారీ పోలీసుల భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆలయం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విగ్రహ శకలాలు కనిపించగా.. దేవాలయ అధికారులకు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి సూరి ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో గుంపులో నుంచి బయటకు వచ్చిన దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. సూరి అయిదుసార్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇదిలా ఉండగా ఆలయ నిర్వహణ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ అరుణ్ పాల్ సింగ్ తెలిపారు. వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారిస్తన్నట్లు వెల్లడించారు.   ఓ వర్గాన్ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సూరి ఇప్పటికే గ్యాంగ్‌స్టర్లు కొన్ని రాడికల్ సంస్థల హిట్-లిస్ట్‌లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆయనకు వై కేటిగిరీ భద్రత కల్పించామని, ఆయన సెక్యూరిటీలో 12 మందికి పైగా పోలీసులు ఉన్నారని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు