థర్డ్‌ వేవ్‌ ముప్పు.. పండగలొస్తున్నాయ్‌ జాగ్రత్త

17 Sep, 2021 06:18 IST|Sakshi

కరోనా మళ్లీ విజృంభించే అవకాశం 

అక్టోబర్, నవంబర్‌ నెలలే అత్యంత కీలకం: కేంద్రం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో థర్డ్‌ వేవ్‌ ముప్పు ఇంక ఉండదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త హెచ్చరికలు చేసింది. అక్టోబర్, నవంబర్‌ నెలలే అత్యంత కీలకమని, ఆ రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు, కోవిడ్‌ టాస్‌్కఫోర్స్‌ చీఫ్‌ వి.కె.పాల్‌ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది పండగల సీజన్‌ కావడంతో ప్రజలు గుంపులుగా తిరగడం పెరుగుతుందని తద్వారా కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు

ఈ రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, స్థానిక యంత్రాంగం ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. థర్డ్‌ వేవ్‌ అన్న మాట వాడకుండానే పాల్‌ కరోనా కేసులపై మాట్లాడారు. కోవిడ్‌ నిబంధనలు అందరూ పాటిస్తూ, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, అందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని హితవు పలికారు.

‘అయితే దేశంలో పెద్దవాళ్లలో దాదాపుగా 62% మంది సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కరోనా మొదటి, రెండు వేవ్‌ల స్థాయిలో తీవ్రంగా మూడో వేవ్‌ వచ్చే అవకాశాలు లేవు. కరోనా సోకితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోం క్వారంటైన్‌ అయ్యే అంశంలో ప్రజలకు తగినంత అవగాహన రావడంతో మళ్లీ కరోనా కేసులు విజృంభించినా అంత ప్రమాదమేమీ ఉండడు’ అని వీకే పాల్‌ ధైర్యం చెప్పారు.  చదవండి: ఆరోగ్యానికి కేరాఫ్‌ పనస

ప్రస్తుతానికి బూస్టర్‌ డోసు ఆలోచన లేదు
కోవిడ్‌ బూస్టర్‌ డోసు ఇవ్వాలన్న ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని, ప్రజలందరికీ రెండు డోసులు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ చెప్పారు. కరోనా రెండు డోసులు ఇవ్వడాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామని, దానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని అన్నారు. బూస్టర్‌ డోసు గురించి కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య వ్యవస్థలో ఎలాంటి చర్చ జరగడం లేదని ఆయన స్పష్టంచేశారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు