ధరాఘాతంతో సామాన్యుడిపై మోయలేని భారం

4 Jun, 2021 09:32 IST|Sakshi
(ప్రతీకాత్మక చిత్రం)

మండుతున్న నిత్యావసరాల ధరలు

నూనె, పప్పులు, కూరగాయలు పైపైకి

ధీనికితోడు పెట్రోల్‌, డీజిల్‌

ఆందోళనలో సామాన్య ప్రజలు

లాక్‌డౌన్‌లో ఎదురవుతున్న తీవ్ర కష్టాలు

బరంపురం: విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఒడిశా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ప్రధానంగా రోజూ వినియోగించే కందిపప్పు, ఉల్లి, కూరగాయలు, నూనెల రేట్లు వినియోగదారులను బెదిరేలా చేస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాల చెబుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉడకని పప్పులు
మార్కెట్‌లో పప్పుల ధరలు ఆందుబాటులో లేకుండా పోయాయి. కొద్ది రోజుల వ్యవధిలో కిలో కందిపప్పు రూ.150 కు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో దీని ధర రూ.90 నుంచి రూ.95 ఉండేది. నెల రోజుల కిందట రూ.90 ఉండేది. అయితే వారం రోజుల కిందట రూ.120లకు పెరిగి, ప్రస్తుతం కిలో రూ.140కి ఎగబాకింది. ఇక కిలో మినపప్పు ధర రూ.150కి చేరింది. దీంతో సామాన్యులు ఇడ్లీ, దోశ వంటి వాటిని వండుకోవడం మానేశారు.

వంటనూనె సలసల
వంట నూనెల ధర మార్కెట్‌లో సలసల కాగుతున్నాయి. పేదలు, సామాన్యులు అధికంగా వినియోగించే పామోలిన్‌ లీటర్‌ ధర రూ.130కి  చేరింది. గతంలో దీని ధర రూ.80 ఉండగా ప్రస్తుతం రూ.130కి చేరింది.   ఇక సన్‌ఫ్లవర్‌ నూనె లీటర్‌ రూ.200కు పెరిగింది. మిగిలిన వంట నూనెలు వందకు పైగా ధరలు పెరగడంతో పేదలు, సామాన్య ప్రజల బతుకు జీవనం కష్టంగా మారింది.

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి 
ఉల్లి లేనిదే కూర రుచించదు. అన్ని తరగతుల వారు వినియోగించే దీనికి డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. అయితే దీనిధర కొండెక్కడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. రిటైల్‌ బహిరంగ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ.30 నుంచి రూ.40 వరకూ పలుకుతోంది.

కూరగాయల ధరలు ఆకాశానికి
ఇక టమాటో కిలో రూ.30, బంగాళదుంపలు కిలో రూ.35, ఇతర కురగాయలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్, షట్‌డౌన్‌ కారణంగా దిగుమతులు తగ్గడాన్ని అసరాగా చేసుకున్న వ్యాపారస్తులు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ధరలు మరింతగా పెంచుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టి ధరలు తగ్గించే ఏర్పాట్లు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు