రైల్వే ట్రాక్‌ దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్‌.. తునాతునకలైన బైక్‌!

29 Aug, 2022 21:18 IST|Sakshi

లక్నో: రైలు పట్టాలు దాటే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గేటు వేసినా ఆ ఏమౌతుందిలే అని వెళ్లే ప్రయత్నం చేస్తే.. ప్రాణాల మీదకే వస్తుంది. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో జరిగింది. అయితే.. ఇక్కడ రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయింది ఓ వ్యక్తి బైక్‌. ఆ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 

బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్‌ వద్ద ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నించాడు. గేటు వేసి ఉన్నా పట్టాలపైకి బైక్‌తో వెళ్లాడు. అయితే.. అవతలి ట్రాక్‌పై ఓ రైలు వెళ్తుండటంతో ఈ వైపు ఉన్న పట్టాలపై వేచి ఉన్నాడు. అప్పుడే మరో రైలు ఆ వ్యక్తి ఉన్న పట్టాలపై దూసుకొస్తోంది. అది గమనించిన సదరు వ్యక్తి బండిని వెనక్కి తిప్పే క్రమంలో పట్టాల మధ్యలో పడిపోయింది. దానిని లాగేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అక్కడే వదిలేసి వెనక్కి పరిగెట్టాడు. క్షణాల వ్యవధిలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. ద్విచక్రవాహనంపై నుంచి వెళ్లింది. బైక్‌ తునాతునకలైంది. ఆగస్టు 26న జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రైల్వే పోలీసులు బైక్‌ యజమానిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: రైల్వే స్టేషన్‌లో కిడ్నాపైన బాలుడు.. బీజేపీ కార్పొరేటర్‌ ఇంట్లో ప్రత్యక్షం!

మరిన్ని వార్తలు