ఇండియాలో సౌత్‌ కొరియన్‌ వక్రబుద్ధి.. కంపెనీ పేరుతో మహిళలతో రాసలీలలు!

21 Sep, 2022 08:19 IST|Sakshi

తిరువళ్లూరు: కార్లకు కీ తయారు చేసే కంపెనీలో మహిళ ఉద్యోగినులపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కంపెనీ డైరెక్టర్‌ కియాంగ్‌ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది.

వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ తొడుగాడులో కార్లకు కీ తయారు చేసే పరిశ్రమ ఉంది. కాగా, ఈ కంపెనీలో 300 మంది పని చేస్తున్నారు. కంపెనీ డైరెక్టర్‌గా దక్షణ కొరియాకు చెందిన కియాంగ్‌ జూ లీ, హెచ్‌ఆర్‌గా రాము పని చేస్తున్నారు. కంపెనీలో పనిచేసే యువతులకు డైరెక్టర్‌ కియాంగ్‌ జూ లీ, హెచ్‌ఆర్‌ రాము సాయంతో తరచూ  లైగింక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై బాధిత యువతులు మప్పేడు పోలీసులకు, మేనేజ్‌మెంట్‌కు గతంలో ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీకుదిర్చినట్లు తెలిసింది. 

దీంతో కక్ష్యకట్టిన డైరెక్టర్‌ లీ, తనపై ఫిర్యాదు చేసిన వారిలో కొందరిని ఉద్యోగం నుంచి తొలగించాడు. మరికొందరిని అక్కడి నుంచి వేరే బ్రాంచీకి బదిలీ చేసినట్లు తెలిసింది. పోలీసుల హెచ్చరికతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న లీ, ఇటీవల వేధింపుల పర్వానికి తెరతీశాడు. కంపెనీలో పనిచేసే యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నేరుగా యువతులు నివాసం ఉండే రూమ్‌లకు వెళ్లి వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు.  దీంతో వేధింపులు తాళలేక బాధిత యవతులు స్థానిక పోలీసులు, పంచాయతీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఫిర్యాదులు చేశారు. తమపై లైగింక వేధింపులకు గురిచేస్తున్న కియాంగ్‌ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

ఆడియో వైరల్‌  
కంపెనీలో పనిచేసే 27 ఏళ్ల యువతిపై రెండు నెలల నుంచి లీ వేధింపుల ఎక్కువైనట్లు తెలిసింది. యువతి నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లిన లీ తనతో సహాజీవనం చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగం నుంచి బయటకు పంపుతానని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లీ బెదిరింపులపై యువతి కంపెనీ యాజమాన్యానికి ఫోన్‌ ద్వారా చేసిన ఫిర్యాదు ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. “నాకు త్వరలోనే వివాహం కానుంది. ఈ సమయంలో లీ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంటికి వచ్చి మరీ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని’ యువతి యాజమాన్యంతో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది.      
 

మరిన్ని వార్తలు