2 వారాలు సర్వం బంద్‌.. నేటి నుంచి పూర్తి లాక్‌డౌన్‌

10 May, 2021 00:31 IST|Sakshi
లాక్‌డౌన్‌తో ఆదివారం బెళగావి వద్దనున్న సువర్ణ విధానసౌధ వద్ద నిర్మానుష్యంగా మారిన రహదారి

సాక్షి, బెంగళూరు: పాక్షిక లాక్‌డౌన్‌ వల్ల కరోనా కేసులు ఏమాత్రం తగ్గకపోవడంతో కర్ణాటక సర్కారు సోమవారం నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయనుంది. రాష్ట్రంలో నిత్యం 45 వేలకు పైగా పాజిటివ్‌లు, సుమారు 350కి పైగా మరణాలు సంభవిస్తూ ప్రజా జీవితం అతలాకుతలమవుతోంది. ఏ ఆస్పత్రి చూసినా కోవిడ్‌ రోగులతో కిటకిటలాడుతున్నాయి.

దీంతో కోవిడ్‌ కట్టడికి రెండువారాల కింద నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 27 నుంచి మే 12 వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపులతో లాక్‌డౌన్‌ విధించారు. ఇవేమీ కూడా కరోనా విజృంభణను నిలువరించలేకపోయాయి. దీంతో చివరి అస్త్రంగా సంపూర్ణ లాక్‌డౌన్‌కు యడియూరప్ప సర్కారు సిద్ధమైంది. చదవండి: (కర్ణాటకలో మహిళల దైన్యం.. పోలీసుస్టేషన్లకు క్యూ)

రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. తరువాత జన సంచారంతో పాటు మొత్తం బంద్‌ అవుతాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. ఆస్పత్రులకు వెళ్లవచ్చు. వివాహాలకు 50 మందికి మాత్రమే అవకాశం. నిర్మాణ కార్మికులు పనులకు వెళ్లవచ్చు. సిటీ, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు బంద్‌. కేవలం రైళ్లు, విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.  

మరిన్ని వార్తలు