కొలీజియంపై ఫిర్యాదులను విస్మరించలేం

2 Oct, 2022 05:06 IST|Sakshi

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ  

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ పనితీరుపై ప్రభుత్వం సహా పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని విస్మరించలేమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. కొలీజియం విషయంలో పౌర సమాజం, న్యాయవాద సంఘాల ఆందోళనలను కొట్టిపారేయలేమని అన్నారు. న్యాయ వ్యవస్థలో వైవిధ్యం కోసం ఒక సంస్థాగత యంత్రాంగం లేకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు.

ఆసియన్‌ ఆస్ట్రేలియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ‘కల్చరల్‌ డైవర్సిటీ, లీగల్‌ ప్రొఫెషన్‌’ అంశంపై సదస్సులో జస్టిస్‌ రమణ ప్రసంగించారు. కోర్టు ధర్మాసనాల్లో వైవిధ్యం ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. విభిన్న అనుభవాలు కలిగిన న్యాయమూర్తులు ధర్మాసనంలో సభ్యులుగా ఉండాలని చెప్పారు. న్యాయ వ్యవస్థలో తాము కూడా భాగస్వాములమేనన్న నమ్మకం ప్రజలకు కలిగేలా జడ్జీలు వ్యవహరించాలన్నారు. భిన్నమైన నేపథ్యాలు కలిగినవారిని నియమించేందుకు తాను ప్రయత్నించానని చెప్పారు. దాదాపు తాను చేసిన అన్ని సిఫార్సులను కేంద్రం ఆమోదించిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు