వధువులకు ఇచ్చిన మేకప్ కిట్లలో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రలు

30 May, 2023 15:55 IST|Sakshi

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేపట్టిన సామూహిక వివాహ పథకం మరోసారి వివాదంలో చిక్కుకుంది. గతంలో వివాహానికి ముందు కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లిలో వధువులకు అందించే మేకప్‌ కిట్‌లో కండోమ్స్‌, గర్భనిరోధక మాత్రలు అందజేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

మధ్యప్రదేశ్‌లోని  ఝబువా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకం కింద సోమవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ పథకం ద్వారా 296 జంటలు ఒకటయ్యాయి. కాగా కొత్తగా పెళ్లైన వధువులకు ఈ పథకం కింద అందించిన మేకప్‌ కిట్‌ బాక్స్‌లో కండోమ్స్‌, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేశారు. మేకప్‌ కిట్‌ తెరిచి చూసిన వధువులు వాటిలో కండోమ్స్‌, బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో సీఎం చౌహాన్‌నపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

అయితే దీనిపై జిల్లా అధికారి భుర్సింగ్‌ రావత్‌ స్పందించారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక మందులను పంపిణీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత తమది కాదని. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ వీటిని అందజేసే అవకాశం ఉందన్నారు.

తాము కేవలం ముఖ్యమంత్రి కన్యా వివాహ/నిఖా యోజన కింద లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలోకి రూ.49,000ని ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని, పెళ్లి సమయంలో ఆహారం, వాటర్‌, టెంట్‌, వాటికి సంబంధించిరూ. 6000 వేలు అందిస్తామని తెలిపారు. అయితే పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముంటుందో తమకు తెలీదని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి కన్య వివాహ/ నిఖా యోజన పథకాన్ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 2006 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాల మహిళలకు పెళ్లికి సాయం అందించాలనే నేపథ్యంలో దీనిని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వధువు కుటుంబానికి ప్రభుత్వం రూ.55,000 వేల అందిస్తుంది. 
చదవండి: Protesting Wrestlers: పతకాలు విసిరేస్తాం! నిరహార దీక్షకు దిగుతాం!

మరిన్ని వార్తలు