మోదీ సర్కారు మెతక వైఖరి వల్లే చైనా ఆగడాలు!

13 Dec, 2022 06:18 IST|Sakshi

న్యూఢిల్లీ:  సరిహద్దు విషయంలో నిజాలు బయటకు రాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. మన ప్రభుత్వ వైఖరి వల్లే చైనా రెచ్చిపోతుందని అన్నారు. మోదీ సర్కారు మెతక వైఖరిని డ్రాగన్‌ ఉపయోగించుకుంటోందని చెప్పారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎల్‌ఏసీ వద్ద భారత్, చైనా జవాన్ల ఘర్షణ నేపథ్యంలో ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. చైనా నుంచి దాడులు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని, మేల్కొల్పేందుకు తాము ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాజకీయ ప్రతిష్టను కాపాడుకొనేందుకు చైనాపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో మన సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి గర్వపడుతున్నామని జైరామ్‌ రమేశ్‌ పేర్కొన్నారు.

చైనా చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. దేశం కంటే ఎవరూ ఎక్కువ కాదని, నరేంద్ర మోదీ మాత్రం తన వ్యక్తిగత ప్రతిష్టం కోసం దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. సరిహద్దుల్లో ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడించారు.   

సరిహద్దులో భారత్‌-చైనా బలగాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాలకు స్వల్ప గాయాలు!

మరిన్ని వార్తలు