కన్యాకుమారి నుంచి కశ్మీర్‌.. భారత్‌ జోడో యాత్ర

16 May, 2022 07:27 IST|Sakshi

నవ్‌ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌లో సోనియా ప్రకటన

ఉదయ్‌పూర్‌ నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: వరుస ఓటములతో నీరసించిన కాంగ్రెస్‌లో పునరుత్తేజం తీసుకొచ్చి, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు అధినేత్రి సోనియా గాంధీ ‘భారత్‌ జోడో’ నినాదం ఇచ్చారు. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి నుంచి దేశవ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. ‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా యాత్ర సాగుతుంది. సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా నేతలు, కార్యకర్తలంతా భాగస్వాములు కావాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం చింతన్‌ శిబిర్‌లో ముగింపు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.

‘2024’ దృష్టితో సంస్కరణలు
పార్టీలో చేపట్టాల్సిన సంస్కరణలపై చింతన్‌ శిబిర్‌లో విస్తృతంగా చర్చించామని సోనియా అన్నారు. ‘‘2024 ఎన్నికలపై దృష్టి పెడుతూ పలు సంస్కరణలు అమలు చేయనున్నాం. అందుకు రెండు మూడు రోజుల్లో టాస్క్‌పోర్స్‌ ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు. తన నేతృత్వంలో రానున్న అడ్వైజరీ కమిటీ వల్ల సీనియర్‌ సహచరుల అనుభవం నుంచి తాను నేర్చుకొనే అవకాశం ఉంటుందన్నారు. అది నిర్ణయాలు తీసుకొనే కమిటీ కాదని స్పష్టత ఇచ్చారు. అడ్వైజరీ కమిటీ భేటీలే కాకుండా సీడబ్ల్యూసీ సమావేశాలు యథాతథంగా కొనసాగుతాయని ఆమె వివరించారు.

మేనిఫెస్టోలో ఈవీఎంల రద్దు: చవాన్‌
ఈవీఎంల విశ్వసనీయత, పనితీరుపై పార్టీల్లో, ప్రజల్లో అనుమానాలున్నందున వాటిని పక్కనపెట్టి, ఎన్నికల్లో మళ్లీ పేపర్‌ బ్యాలెట్‌ విధానం తేవాలన్నది కాంగ్రెస్‌ ఉద్దేశమని పార్టీ సీనియర్‌ నేత పృథ్వీరాజ్‌ చవాన్‌ చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ మేరకు హామీ ఇస్తామన్నారు. ఈవీఎంల వల్ల ఎన్నికల్లో జరిగే అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పేపర్‌ బ్యాలెట్ల అంశాన్ని చింతన్‌ శిబిర్‌లో లేవనెత్తానని అన్నారు. చాలామంది నేతలు తన వాదనకు మద్దతు పలికారని వెల్లడించారు.

ఈవీఎంలను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినా ఫలితం ఉండదని, అందుకే తమ మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపర్చాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో నెగ్గడం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమని వివరించారు. తమ విజయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని కాంగ్రెస్‌ గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీ పేపర్‌ బ్యాలెట్లను ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ పదేపదే కోరుతోంది.

సవాళ్లను అధిగమిస్తాం
‘‘చింతన్‌ శిబిర్‌ చాలా ఉపయోగకరంగా, ఫలవంతంగా సాగింది. నా పెద్ద కుటుంబం (కాంగ్రెస్‌)తో గడిపే అవకాశం కలిగింది’’ అని సోనియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘సవాళ్లను కచ్చితంగా అధిగమిస్తాం. కాంగ్రెస్‌కు కొత్త శుభోదయం రానుంది. అదే మన అంకితభావం. అదే నూతన సంకల్పం’’ అన్నారు. భారత్‌ జోడోయాత్రలో తన లాంటి సీనియర్‌ నేతలు కూడా ఇబ్బందులు పడకుండా పాల్గొనే మార్గాలు వెతకాలంటూ చమత్కరించారు. సమాజంలో అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని బలోపేతం చేయడానికి, లుప్తమైపోతున్న రాజ్యాంగ విలువలను కాపాడేందుకే ఈ యాత్ర అన్నారు. నిరుద్యోగం, ధరల భారం అంశాలను జన జాగరణ్‌ అభియాన్‌–2లో లేవనెత్తుతామన్నారు.

ఇది కూడా చదవండి: బీజేపీ సహా అనేక ప్రాంతీయ పార్టీలలో ఈ పరిస్థితి లేదు..

మరిన్ని వార్తలు