నాకు సమాధి తవ్వే పనిలో... విపక్షాలపై ప్రధాని మోదీ మండిపాటు

13 Mar, 2023 04:15 IST|Sakshi

పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నా 

ప్రజలే నాకు రక్షణ కవచం 

కర్ణాటకలో రహదారులు, పలు అభివృద్ధి పనులు ప్రారంభం 

మండ్యలో భారీ రోడ్డు షో  

మండ్య/ధార్వాడ/హుబ్లీ: పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం తాను అవిశ్రాంతంగా శ్రమిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు తనకు సమాధి తవ్వే పనిలో తీరిక లేకుండా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటకలో మండ్య వద్ద 118 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు–మైసూరు 10 లేన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ఆయన ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. మైసూరు–కుశాలనగర 4 లేన్ల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. తనను సమాధి చేయాలని కాంగ్రెస్‌ కలలు కంటోందని ఆక్షేపించారు. తనకు ఈ దేశ మాతృమూర్తులు, ఆడపిల్లలు, ప్రజలు రక్షణ కవచంగా ఉన్నారనే సంగతిని విపక్షాలు మరచిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు.

పేదల బతుకుల్లో మార్పు  
దేశంలో గడిచిన 9 ఏళ్లలో వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది పేదల బతుకుల్లో మార్పు వచ్చిందని మోదీ అన్నారు. పేదల కనీస అవసరాలైన సొంత ఇల్లు, తాగునీరు, విద్యుత్, గ్యాస్‌ సరఫరా, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఆస్పత్రుల నిర్మాణం వంటి పనులను బీజేపీ ప్రభుత్వం చేపడుతోందన్నారు. 9 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. జలజీవన్‌ మిషన్‌ కింద 40 లక్షల ఇళ్లకు తాగునీటి సదుపాయం కల్పించినట్లు చెప్పారు.

140 కోట్ల మందిని అవమానించారు  
విద్యార్థులు తమ చదువులు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ధార్వాడలో ఐఐటీ విద్యాసంస్థ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. లండన్‌లో బసవేశ్వరుడి విగ్రహాన్ని జాతికి అంకితం చేసే భాగ్యం తనకు కలిగిందన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా లండన్‌లో మాట్లాడారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు. 140 కోట్ల మంది భారతీయులను అవమానించారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్నారు.  

ప్రపంచ దేశాలకు ఆశాకిరణం  
ప్రపంచ దేశాలకు ప్రస్తుతం భారత్‌ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవి ఆరాటపడుతున్నాయని తెలిపారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలోనూ కర్ణాటకలో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు.  
 
అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర

న్యూఢిల్లీ: చరిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం మహాత్మా గాంధీకి, యాత్రలో పాల్గొన్న నేతలకు నివాళులర్పించారు. బ్రిటిష్‌ వారిపై ప్రజల పోరాటంగా దండి యాత్ర గుర్తుండిపోతుందన్నారు. అన్యాయంపై ప్రజాగ్రహమే దండి యాత్ర అని ట్విట్టర్‌లో తెలిపారు. మన దేశ చరిత్రలో దండి యాత్ర కీలకమైన ఘట్టమని ఉద్ఘాటించారు. దండి యాత్రగా పేరుగాంచిన ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్‌ 5న ముగిసింది.

పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌ జాతికి అంకితం
ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్‌ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్‌లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫామ్‌ను ప్రధాని ఆదివారం జాతికి అంకితం ఇచ్చారు. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుదీకరించిన హోస్పేట–హుబ్బళ్లి–తినాయ్‌ఘాట్‌ రైల్వే సెక్షన్‌ను జాతికి అంకితమిచ్చారు. హుబ్బళ్లి–ధార్వాడ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా పలు పనులకు శంకుస్థాపన చేశారు. జయదేవ హాస్పిటల్, రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణానికి, ధార్వాడ మల్టీ విలేజ్‌ వాటర్‌ సప్లై స్కీమ్‌ పనులకు పునాదిరాయి వేశారు. తుప్పరిహళ్లి ఫ్లడ్‌ డ్యామేజ్‌ కంట్రోల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మండ్య జిల్లాకేంద్రంలో ప్రధాని రోడ్డు షోలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు