గుజరాత్‌ బీజేపీ సర్కార్‌పై చిదంబరం ఫైర్‌.. తీగల వంతెన ప్రమాదంపై సీరియస్‌

8 Nov, 2022 13:55 IST|Sakshi

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్లాన్స్‌ రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఇక, చిదంబంరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నడపడం లేదని.. ఢిల్లీ నుంచి నడుస్తోందని విమర్శించారు. ఇటీవల గుజరాత్‌లో కుప్పకూలిన మోర్బీ తీగల వంతెన ఘటన దారుణమైందన్నారు. ఈ ఘటన గుజరాత్‌కే తలవంపులు తెచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై బీజేపీ ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఎవరూ క్షమాపణ చెప్పలేదన్నారు. ఈ ప్రమాద ఘటనకు ఎవరూ బాధ్యత వహించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు.. కేంద్ర దర్యాప్తు సంస్థలపై కూడా చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఏజెన్సీలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ఏజెన్సీల ద్వారా అరెస్టు చేయబడిన వారిలో 95 శాతం మంది ప్రతిపక్ష నాయకులేనని చిదంబరం ఆరోపించారు.

ఈ సందర్భంగానే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీపై కూడా సంచలన కామెంట్స్‌ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌.. ముందు దేశ రాజధాని గురించి ఆలోచన చేయాలని హితవు పలికారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, గాలి నాణత్య గురించి ప్రజలు ఆలోచిస్తే.. కేజ్రీవాల్‌కు ఎవరూ ఓటు వేయరని అన్నారు. 

>
మరిన్ని వార్తలు