Congress Party: ‘హస్త’ వాసి మారేనా?

13 May, 2022 06:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వరుస ఎన్నికల పరాజయాలతో నిరాసక్తతతో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న చింతన్‌ శిబిర్‌ శుక్రవారం నుంచి మొదలు కానుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో పాటు వివిధ విభాగాల అధిపతులు, ఆఫీస్‌ బేరర్లు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కలిపి మొత్తం 422 మంది సభ్యులు పాల్గొననున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంస్థాగత, వ్యవసాయ సమస్యలు, అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై రోడ్‌మ్యాప్‌ సిధ్దం చేయనున్నారు. మే 13న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేయనుండగా, 15న రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా..
2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండో సారి ఓటమి, ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయ భారంతో కుంగిపోయిన కాంగ్రెస్‌కు భవిష్యత్తు వ్యూహాన్ని నిర్ణయించడంలో చింతన్‌ శిబిర్‌ చాలా కీలకంగా మారింది. 2013లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జైపూర్‌లో చివరిసారిగా చింతన్‌ శిబిర్‌ను నిర్వహించగా, అనంతరం ఇప్పుడే మళ్లీ పార్టీ ఈ తరహా భేటీని నిర్వహిస్తోంది. నిర్మాణాత్మక మార్పుల కోసం కాలానుగుణ కార్యాచరణ ప్రణాళికను, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపిక చేసిన సమస్యలపై సుదీర్ఘ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం లక్ష్యంగా ఈ శిబిర్‌ను నిర్వహిస్తోంది.

రాహుల్‌ కేంద్రంగా రాజకీయం
ఈ సమావేశం వేదికగా రాహుల్‌గాంధీని పార్టీ అధ్యక్షునిగా నియమించాలనే డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ పగ్గాలు చేపట్టాలంటూ  పార్టీ సీఎంలు అశోక్‌ గహ్లోత్‌ (రాజస్తాన్‌), భూపేష్‌ బఘేల్‌ (ఛత్తీస్‌గఢ్‌)లు బహిరంగంగానే మాట్లాడుతుండగా, రణదీప్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ వంటి నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. అయితే జీ–23 నేతల డిమాండ్‌ నేపథ్యంలో ఆగస్టు–సెప్టెంబర్‌ మధ్యలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు మరికొందరు తెలిపారు.

మరిన్ని వార్తలు