Prashant Kishor: కాంగ్రెస్‌కి నా అవసరం లేదు: ప్రశాంత్‌ కిశోర్‌

29 Apr, 2022 06:16 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో చేరడానికి నిరాకరించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆ పార్టీకి తన అవసరం లేదని స్పష్టం చేశారు. తనంతట తానుగా పూర్వ వైభవాన్ని సాధించే శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్‌కు  ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆజ్‌తక్‌ ఛానెల్‌కి ప్రశాంత్‌ కిశోర్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ భవిష్యత్‌ ప్రణాళికలపై ఎన్నో అంశాల్లో తనకు, అధిష్టానానికి మధ్య అంగీకారం కుదిరిందని చెప్పారు. అయితే అవన్నీ ఆ పార్టీ తనంతట తానే చేసుకోగలదని, ఎందరో తలపండిన నాయకులు ఆ పార్టీలో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తన అవసరం లేదని, అందుకే పార్టీలోకి తనని రమ్మని ఆహ్వానించినా తిరస్కరించానని చెప్పారు.

కాంగ్రెస్‌లో ఎలాంటి పాత్రా పోషించాలని తాను అనుకోలేదని, భవిష్యత్‌ ప్రణాళికకు సంబంధించి ఒక బ్లూ ప్రింట్‌ అనుకుంటే కచ్చితంగా అమలు చేసి తీరాలని ఆశించానని చెప్పారు. ‘‘కాంగ్రెస్‌కి ఏం చెప్పదలచుకున్నానో అది చెప్పేశాను. 2014 తర్వాత కాంగ్రెస్‌ తన ప్రణాళికల్ని ఒక నిర్ణయాత్మక పద్ధతిలో చర్చించడం చూశాను. కానీ ఆ పార్టీ సాధికారత కార్యాచరణ బృందంపై నాకు కొన్ని అనుమానాలున్నాయి. అనుకున్న మార్పుల్ని ఆ బృందమే అమలు చేయాలి. అందులోనే నన్ను సభ్యుడిగా చేరమన్నారు’’అని పీకే వెల్లడించారు. ప్రియాంకగాంధీకి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించాలని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదిస్తే కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించలేదని వచ్చిన వదంతుల్ని ఆయన కొట్టిపారేశారు. తాను ఎవరి పేర్లను చెప్పలేదన్నారు.

మరిన్ని వార్తలు