సయోధ్య సాధ్యమేనా..?

16 Jul, 2021 05:46 IST|Sakshi

కెప్టెన్‌ అమరీందర్‌ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ హరీష్‌ రావత్‌ వెల్లడి

పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్‌ సింగ్‌ సిద్ధూ?

త్వరలో అధికారిక ప్రకటన విడుదల

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసమ్మతికి చెక్‌ పెడుతూ కాంగ్రెస్‌ అధిష్టానం వ్యూహ రచన పూర్తి చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికను హైకమాండ్‌ సిద్ధం చేసింది. అందులో భాగంగా పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ హరీష్‌ రావత్‌ కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ పోరాడనున్నట్లు ఆయన గురువారం స్పష్టం చేశారు.  

పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవజోత్‌ సింగ్‌ సిద్ధూని పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమించవచ్చని హరీష్‌ రావత్‌ సూచించారు.  గతంలో సిద్ధూ, అమరీందర్‌ సింగ్‌ ఇద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే మాటల యుద్ధం చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించేందుకు పార్టీ హైకమాండ్‌ ఏర్పాటు చేసిన మల్లికార్జున్‌ ఖర్గే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ పంజాబ్‌లో పర్యటించి ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి నివేదికను హైకమాండ్‌కు సమర్పించింది. అనంతరం ఇరువురు నాయకులు పార్టీ పెద్దలతో వేరువేరుగా భేటీ అయిన విషయం తెలిసిందే.  
కాంగ్రెస్‌ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 2022 అసెంబ్లీ ఎన్నికలలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నాయకత్వంలోనే కాంగ్రెస్‌ పోరాడనుండగా, అదే సమయంలో నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు కూడా పూర్తి గౌరవం ఇచ్చేలా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. పంజాబ్‌లో తిరిగి అధికారంలోకి రావడం ఎంత అవసరమో, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం భవిష్యత్‌ నాయకులను కాపాడటం కూడా అంతే ముఖ్యమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే నవజోత్‌సింగ్‌ సిద్ధూకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.  

పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించేందుకు త్వరలో కీలక ప్రకటన జరగవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పంజాబ్‌ కాంగ్రెస్‌కు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్టానం ఫార్ములా సిద్ధం చేసిందని సమాచారం. ఒకవేళ నవజోత్‌సింగ్‌ సిద్ధూ పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడైతే, ఇద్దరు లేదా ముగ్గురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమించే యోచనలో ఉంది. అదే సమయంలో ఇటీవల నవజోత్‌ సింగ్‌ సిద్దూ చేసిన ట్వీట్‌ పంజాబ్‌ రాజకీయాల్లో ప్రకంపనలను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో అమరీందర్, సిద్ధూల మధ్య దూరాన్ని తగ్గించేందుకు సిద్ధూని పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా చేయడంవల్ల పరిస్థితి ఇప్పుడు చల్లబడినప్పటికీ, రాబోయే రోజుల్లో గొడవ మరింత ముదిరే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.  

వచ్చే ఎన్నికల తర్వాత సిద్ధూ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నందున అమరీందర్‌ విధేయులు ఎమ్మెల్యేలుగా గెలవాలని ఆయన కోరుకొనే పరిస్థితి ఉండదని తెలిపారు. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో తమ విధేయులకు ఎక్కువ టికెట్లు కోరుతూ ఎవరికి వారు పోటీపడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ పంజాబ్‌లో సిద్ధూకి ఉన్న ప్రజాదరణ కారణంగా ఆయనను పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమించాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ హైకమాండ్‌ ముందు నెలకొంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి రిస్క్‌ చేయదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం సిద్ధూపై దృష్టి సారించినందుకు వీలైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దాలని హైకమాండ్‌ యోచిస్తోంది.   

మరిన్ని వార్తలు