కాంగ్రెస్‌ బలహీనపడింది

28 Feb, 2021 06:21 IST|Sakshi
వేదిక వద్ద ఆజాద్, ఆనందశర్మ తదితరులు

కొత్త తరం పార్టీకి కనెక్ట్‌ కావాలి

జమ్మూలో జీ23 నేతల శాంతి సమ్మేళన్‌ 

రాహుల్‌గాంధీ నార్త్, సౌత్‌ వ్యాఖ్యల నేపథ్యంలో సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్త నాయకులు మరోసారి తమ గళం విప్పారు. గత దశాబ్ద కాలంగా పార్టీ పూర్తిగా బలహీనపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త తరం పార్టీకి కనెక్ట్‌ కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జమ్మూలో శుక్రవారం జీ23 గ్రూపులో నాయకులు బహిరంగంగా ఒకే వేదికపై శాంతి సమ్మేళన్‌ పేరుతో బల ప్రదర్శనకి దిగారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులైన గులామ్‌ నబీ ఆజాద్, ఆనంద్‌ శర్మ, కపిల్‌ సిబల్, భూపీందర్‌ హూడా, రాజ్‌ బబ్బర్‌ వంటి నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. గతంలో ఈ నాయకులంతా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖలో పార్టీ ప్రక్షాళన, అంతర్గత ప్రజాస్వామ్యం, నాయకత్వం వంటి అంశాలను ప్రస్తావించారు.  

పార్టీని ఇలా చూడలేకపోతున్నాం
గత పదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా బలహీనంగా మారిపోయిందని జీ23 నేతల్లో ఒకరైన ఆనంద్‌ శర్మ అన్నారు. పార్టీ బాగా ఉన్న రోజుల్ని చూసిన తాము ఇలా బలహీనంగా ఉన్న పార్టీని చూడలేకపోతున్నామని అన్నారు. ‘‘మేము ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. మాలో ఎవరూ దొడ్డిదారిలో పార్టీలోకి రాలేదు. ప్రధాన ద్వారం వెంబడి నడిచే వచ్చాం. విద్యార్థి ఉద్యమాలు, యువజన ఉద్యమాల్లో పాల్గొని ఈ స్థాయికి చేరుకున్నాం. కానీ నేటి తరం పార్టీకి కనెక్ట్‌ కావడం లేదు’’అని ఆనంద్‌ శర్మ వాపోయారు.

ఆజాద్‌ అనుభవం అక్కర్లేదా ..?
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కి మరోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై కపిల్‌ సిబల్‌ మండిపడ్డారు. ఆజాద్‌ అనుభవం పార్టీకి అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆజాద్‌ ఇంజనీర్‌ వంటి వాడని ఆయన పార్లమెంటులో లేకపోవడం అత్యంత విచారకరమని అన్నారు. ప్రతీ రాష్ట్రంలోని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పరిస్థితులు ఆజాద్‌కి తెలిసినట్టుగా మరే నాయకుడికి తెలియవని అన్నారు.  

నిప్పు రాజేసిన నార్త్‌ వర్సస్‌ సౌత్‌ వ్యాఖ్యలు  
కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌గాంధీ తీసుకుంటున్న నిర్ణయాలపై చాలా కాలంగా సీనియర్‌ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీలో కీలక పదవుల్ని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పదవుల్ని రాహుల్‌ తన సన్నిహితులకి ఇస్తున్నారని, పార్టీలో సీనియర్లని విస్మరిస్తున్నారన్న అసంతృప్తిలో ఉన్నారు. అదే సమయంలో కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ చేసిన నార్త్‌ వర్సస్‌ సౌత్‌ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా నిప్పు రాజేశాయి. ఈ మధ్య రాహుల్‌ గాంధీ తిరువనంతపురంలో మాట్లాడుతూ ‘‘ఉత్తరాదిన నేను 15 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు రాజకీయాలు వేరేగా ఉండేవి. కేరళ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాక చాలా హాయిగా అనిపిస్తోంది. దక్షిణాది ప్రజలకి అన్ని అంశాల్లో ఆసక్తి ఉంది. ఎంతో లోతుగా అన్ని విషయాలు వారు తెలుసుకుంటారు’’అని కితాబునిచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే జీ23 నాయకులు సమావేశమయ్యారు. ప్రజలు ఏ ప్రాంతం వారైనా ఒక్కటేనని, వారి తెలివితేటల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కపిల్‌  వంటి నాయకులు రాహుల్‌పై ఫైర్‌ అయ్యారు.
 

మరిన్ని వార్తలు