ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

18 Mar, 2023 04:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు ఉపయోగించుకోలేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కేపీ వేణుగోపాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై సమాధానం ఇస్తూ ఫిబ్రవరి 9న రాజ్యసభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీపై రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌ 188 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు కేసీ వేణుగోపాల్‌ తన నోటీసులో పేర్కొన్నారు. నెహ్రూ కుటుంబాన్ని ప్రధాని అవమానించారని ఆక్షేపించారు. నెహ్రూ కుటుంబ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యులేనని గుర్తుచేశారు. నెహ్రూ ఇంటి పేరును ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు వాడుకోలేదని ప్రశ్నించడం అసంబద్ధం, అర్థరహితమని వేణుగోపాల్‌ తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు