ఛండీగఢ్‌ కాదు.. షిమ్లాలోనే! కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఎవరు?.. ఉత్కంఠ

9 Dec, 2022 08:31 IST|Sakshi

షిమ్లా: గుజరాత్‌ ఫలితంతో ఢీలా పడిన కాంగ్రెస్‌ పార్టీ.. హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రం ఘన విజయంతో శ్రేణులు కాస్త ఊరట చెందాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తోంది. 

హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఇవాళ(శుక్రవారం) కీలక సమావేశం నిర్వహించనుంది. అంతకు ముందు.. ఫలితాల ఊగిసలాట సమయంలో ఆపరేషన్‌ లోటస్‌కి భయపడి కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలను ఛండీగఢ్‌కు ఆహ్వానించాలని భావించింది. అయితే.. స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. 

కొత్త లెజిస్లేచర్‌ పార్టీ నేతను ఎనుకున్నేందుకు శుక్రవారం సిమ్లాలోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా భేటీ కాన్నుట్లు కాంగ్రెస్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి రాజీవ్‌ శుక్లా మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని చూసుకునేందుకు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బాఘేల్‌, సీనియర్‌ నేత భూపిందర్‌ హుడాలను పర్యవేక్షకులుగా అక్కడికి పంపనుంది.

ఇదిలా ఉంటే.. ఒక్కో దఫా ఒక్కో పార్టీకి అధికారం కట్టబెట్టే హిమాచల్‌ ప్రజలు.. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగించారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో.. 40 స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది కాంగ్రెస్‌.  మరోవైపు హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య కావడం ఈమెకు కలిసొచ్చే అంశం. అయితే ఇంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సుఖ్వీందర్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రిలు కూడా సీఎం రేసులో ఉండడంతో ఇవాళ్టి భేటీపై ఆసక్తి నెలకొంది.

బీజేపీకి రెబల్స్‌ దెబ్బ పడిందని విశ్లేషకులు అభిప్రాయపడినప్పటికీ.. అలాంటిదేం లేదని తేల్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా. మొత్తం 68 స్థానాల్లో 21 చోట్ల రెబల్స్‌ పోటీ చేయగా.. కేవలం ఇద్దరు మాత్రమే గెలుపొందడం గమనార్హమని ఆయన గుర్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు