దుమారం రేపిన మోదీ వ్యాఖ్యలు... మాటల తూటలు పేల్చిన కాంగ్రెస్‌

18 Sep, 2022 14:12 IST|Sakshi

న్యూఢిల్లీ: నరేంద్రమోదీ పుట్టినరోజు పురస్కరించుకుని నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.... దేశంలో చిరుతలు అంతరించిపోయాయని, తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టేలా... దశాబ్దాలుగా ఎలాంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు జరగలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. 

అయితే, ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. మోదీ దగాకోరు! అంటూ మాటల తుటాలు పేల్చింది. అంతేకాదు ఇది మోదీ క్రెడిట్‌ కాదని, ఆయన చేసిన చారిత్రక ఘట్టానికి తామే ముందు అంకురార్పణ చేశామని తేల్చి చెప్పింది. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించింది. ఈ మేరకు 2009లో ప్రాజెక్టు చిరుత ప్రారంభించిన లేఖను కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల సీనియర్‌ నాయకుడు జై రామ్‌ రమేశ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఆ లేఖలో యూపీఏ హయాంలో పర్యావరణ అటవీ శాఖలను నిర్వహించిన జై రాం రమేష్‌ చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టేందుకు వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌ ఇండియా అధికారులను రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయమని కోరారు. తాను భారత్‌ జోడో యాత్రలో ఉండటం వల్లే ఈ లేఖను వెంటనే పోస్ట్‌ చేయలేకపోయానని జై రామ్‌ రమేశ్‌ వివరణ ఇచ్చారు.

మెరుపు దాడికి ప్రసిద్ధి చెందిన చిరుతలు 1940లలో అంతరించుకుపోయాయి. అయితే 2012 లో యూపీఏ ప్రభుత్వం చిరుతలను తిరిగి ప్రవేశ పెట్టే ప్రణాళిక దరఖాస్తును సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేగాదు కొంతమంది పరిరక్షకులు భారత్‌లోకి ఆఫ్రికన్‌ చిరుతలు దిగుమతి చేసుకోవడం అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ కమిటీ (ఐయూసీఎన్‌) మార్గదర్శకాలకు విరుద్ధమని వాదించారు.

అయితే, నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ 2017లో కోర్టులో ఈ విషయమై దరఖాస్తులు చేసింది. చిరుతలను భారత్‌లోకి ప్రవేశ పెట్టే ప్రాజెక్టు చట్టబద్ధమేనని  ఐయూసీఎన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని కాంగ్రెస్‌ వాదిస్తోంది. వాస్తవానికి ఇదంతా తమ పార్టీ హయాంలోనే జరిగిందని మోదీ ఘనతేమీ కాదని కాంగ్రెస్‌ బలంగా  చెబుతోంది.

(చదవండి: చిరుతల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు)

మరిన్ని వార్తలు