అఖిలేశ్‌, మాయవతిలకు కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానం!

26 Dec, 2022 19:41 IST|Sakshi

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా భారత్‌ జోడో యాత్ర చేపట్టారు రాహుల్‌ గాంధీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తి చేసుకున్న యాత్ర త్వరలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ఈ క్రమంలో భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలని బీజేపీయేతర పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించింది కాంగ్రెస్‌ పార్టీ. అందులో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బహజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి, ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. మరోవైపు.. లఖ్‌నవూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌, మాజీ ముఖ్యమంత్రి దినేశ్‌ శర్మను సైతం ఆహ్వానించింది. 

వచ్చే ఏడాది జనవరి 3న ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది భారత్‌ జోడో యాత్ర. గాజియాబాద్‌ జిల్లాలోని ’లోని’ ప్రాంతంలో ప్రారంభమై బాఘ్‌పత్‌, శామిలి జిల్లాల మీదుగా హరియాణాలోకి వెళ్తుంది. ఈ క్రమంలోనే భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలంటూ రాష్ట్రంలోని ప్రముఖ విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుత సమయంలో ప్రజల మనసులను తెలుసుకునేందుకు యాత్ర ఒక్కటే మార్గమని సూచించారు. ప్రస్తుతం విపక్షం మొత్తం ఈ ప్రభుత్వంపై ఒకే ఆలోచన ధోరణిలో ఉందని, అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు

మరిన్ని వార్తలు