Virbhadra Singh: రాజా సాహిబ్‌ ఇక లేరు! ఆరుసార్లు సీఎంగా..

8 Jul, 2021 07:37 IST|Sakshi

ఆరుసార్లు ముఖ్యమంత్రి, తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే, అయిదుసార్లు ఎంపీ

హిమాచల్‌ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందన్న నేతలు

సిమ్లా: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ (87) కోవిడ్‌ నుంచి కోలుకున్నాక తలెత్తిన ఆరోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు కోవిడ్‌ నుంచి కోలుకున్న ఆయన సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో సోమవారం ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆయన మరణించారని ఐజీఎంసీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జనక్‌ రాజ్‌ వెల్లడించారు.

ఆరుసార్లు ముఖ్యమంత్రిగా, తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు లోక్‌సభకి ఎన్నికై తిరుగులేని విజయాలను మూటగట్టుకున్న వీరభద్ర సింగ్‌ మృతితో హిమాచల్‌ రాజకీయాల్లో ఒక శకం ముగిసిపోయింది. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ. వీరభద్ర సింగ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అపారమైన పరిపాలనా అనుభవం కలిగిన నేతను కోల్పోవడం తీరని లోటని ప్రధాని ఒక ట్వీట్‌లో నివాళులర్పించారు. వీరభద్ర సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా, రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవల్ని ఎన్నటికీ మరువలేమని సోనియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరభద్ర సింగ్‌ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన రామ్‌పూర్‌లో శనివారం జరగనున్నాయి.
 
జన హృదయ విజేత

ప్రజల హృదయాలను గెలుచుకున్న అతి కొద్ది మంది ముఖ్యమంత్రుల్లో వీరభద్ర సింగ్‌ ఒకరు. రాజా సాహెబ్‌ అని అందరూ పిలుచుకునే ఆయన గొప్ప పోరాట యోధుడు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో తిరుగులేని పట్టు కొనసాగించారు. హిల్‌ స్టేషన్‌ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడంతో పాటుగా విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి మాస్‌ లీడర్‌గా ఎదిగారు. రామ్‌పూర్‌ రాజకుటుంబానికి చెందిన వీరభద్ర సింగ్‌ 1934 జూన్‌ 23న జన్మించారు. 1962లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన 28 ఏళ్ల వయసులో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 1983లో తొలిసారిగా హిమాచల్‌ ప్రదేశ్‌ గద్దెనెక్కారు. ప్రస్తుతం సోలాన్‌ జిల్లాలోని అక్రి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రెండు సార్లు కోవిడ్‌బారినపడ్డారు. ఏప్రిల్‌ 12న ఆయనకి తొలిసారి కరోనా సోకింది.జూన్‌ 11న మళ్లీ రెండోసారి ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

మరిన్ని వార్తలు