రాజస్థాన్‌ సీఎం రేసులో అతడు.. సోనియాతో ప్రత్యేకంగా భేటీ

29 Sep, 2022 20:53 IST|Sakshi
సోనియా నివాసం బయట అశోక్‌ గెహ్లాట్‌

ఢిల్లీ: అశోక్‌ గెహ్లాట్‌పై కాంగ్రెస్‌ హైకమాండ్‌ గుర్రుగా ఉండడంతో.. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి మార్పు తప్పబోదనే సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలో.. మరో రెండు రోజుల్లో సోనియా గాంధీ సీఎం మార్పుపై కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో.. రాజస్థాన్‌ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. 

ఈ నేపథ్యంలో రేసులో సచిన్‌ పైలట్‌(45) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అశోక్‌ గెహ్లాట్‌ గనుక కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపడితే సచిన్‌ పైలట్‌కే బాధ్యతలు అప్పజెప్పాలని అధిష్టానం తొలుత భావించింది. ఈలోపు రెబల్‌ పరిణామాలు మొత్తం సీన్‌ను మార్చేశాయి. అయినప్పటికీ.. సచిన్‌ పైలట్‌ వైపు హైకమాండ్‌ మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇవాళ అశోక్‌ గెహ్లాట్‌ భేటీ అనంతరం.. సచిన్‌ పైలట్‌ కూడా 10 జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సచిన్‌ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైందనే ప్రచారం ఊపందుకుంది.

మరిన్ని వార్తలు