‘15 ఏళ్లకే జన్మనివ్వగలరు.. మరి 21 ఎందుకు?’

14 Jan, 2021 10:05 IST|Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ మాజీ మినిస్టర్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. పార్టీకి చెందిన ఓ సీనియర్‌, మాజీ మినిస్టర్‌ ఆడపిల్లల కనీస వివాహ వయసుకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో బీజేపీతో పాటు మహిళా సంఘాలు కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంతకు వివాదం ఏంటంటే సజ్జన్‌ సింగ్‌ వర్మ అనే మాజీ కాంగ్రెస్‌ మినిస్టర్‌ ఆడపిల్లలు 15వ ఏట నుంచే పునరుత్పత్తి చేయగలిగినప్పుడు.. వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడం ఎందుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో రాజకీయ వివాదం రాజుకుంది. బీజేపీ, మహిళా సంఘాలు ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ‘సమ్మన్’‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పక్షం రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో మహిళలపై నేరాల గురించి అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మహిళ కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలని సూచించారు. 

దీనిపై స్పందిస్తూ.. 15 సంవత్సరాల వయస్సులో మహిళలు పునరుత్పత్తి చేయగలరని వాదించిన మిస్టర్ వర్మ, "ఇది నా అన్వేషణ కాదు. వైద్యుల నివేదిక ప్రకారం, 15 సంవత్సరాల వయస్సు నుంచే బాలికలు పిల్లలను కనడానికి అనుకూలంగా ఉంటారు. అయితే 18 ఏళ్ల తర్వాతనే వారు వివాహం చేసుకోవడానికి తగినంతగా పరిణీతి చెందుతారు. అందుకే వివాహ వయసును 18 సంవత్సరాలుగా పేర్కొన్నారు. మరి వారి వివాహ వయసును 18 నుంచి 21కి పెంచడానికి ముఖ్యమంత్రి ఏమైనా డాక్టరా.. శాస్త్రవేత్తనా’ అని వర్మ ప్రశ్నించారు. "బాలికలు 18 ఏళ్లు దాటిన తర్వాత తమ అత్తమామల ఇంటికి వెళ్లి సంతోషంగా ఉండాలి" అని మాజీ మంత్రి అన్నారు.

ఇక సజ్జన్‌ సింగ్‌ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్‌ కొఠారి మాట్లాడుతూ.. ‘‘సజ్జన్‌ సింగ్‌ కేవలం మధ్యప్రదేశ్‌ కుమార్తెలనే కాక దేశవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలని తన మాటలతో అవమానించాడు. తన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యంగ్‌ నేషనల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇద్దరు మహిళలనే విషయం బహుశా సజ్జన్‌ సింగ్‌ మర్చిపోయినట్లున్నాడు. తన వ్యాఖ్యలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని సోనియా గాంధీ సజ్జన్‌ సింగ్‌ని ఆదేశించాలి. ఆయనను పార్టీ నుంచి తొలగించాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు