కోవిడ్‌-19 : కాంగ్రెస్‌ ఎంపీ కన్నుమూత

28 Aug, 2020 19:53 IST|Sakshi

కరోనాతో పోరాడుతూ కన్నుమూత

చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, కన్యాకుమారి కాంగ్రెస్‌ ఎంపీ హెచ్‌ వసంత్‌కుమార్‌ (70) శుక్రవారం మరణించారు. కోవిడ్‌-19కు చికిత్స పొందుతూ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. వసంత్‌కుమార్‌కు ఎక్మో పరికరంతో అపోలో వైద్యులు చికిత్స అందించారు. కోవిడ్‌-19 లక్షణాలు తీవ్రం కావడంతో ఈనెల 10న ఆయనను ఆస్పత్రికి తరలించారు. మూడు వారాల పాటు కరోనా వైరస్‌తో పోరాడిన వసంత్‌కుమార్‌ శుక్రవారం సాయంత్రం 6.56 గంటలకు మరణించారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో అతిపెద్ద గృహోపకరణాల రిటైల్‌ చైన్‌ వసంత్‌ అండ్‌ కోను ఆయన స్ధాపించారు. వసంత్‌కుమార్‌ తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ మాజీ చీఫ్‌ కుమారి అనంతన్‌ సోదరుడు కాగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఆయన సమీప బంధువు.

2006లో వసంత్‌కుమార్‌ తొలిసారిగా నంగునెరి నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కన్యాకుమారి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎంపీ, అప్పటి కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌పై ఘనవిజయం సాధించారు. వసంత్‌కుమార్‌ మృతి పట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ నేత, ఎంపీ హెచ్‌ వసంత్‌కుమార్‌ మరణం కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఆయన మద్దతుదారులు, అభిమానులకు తీరనిలోటని పార్టీ ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జీవాలా ట్వీట్‌ చేశారు.

చదవండి : తమిళనాడులో తెరపైకి రెండో రాజధాని

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు