మా అమ్మను చూస్కోవాలి.. విచారణకు రాలేను! ఈడీకి రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి

16 Jun, 2022 17:40 IST|Sakshi

ఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) విచారణలో ఉన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. దర్యాప్తు సంస్థకు ఓ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విచారణకు హాజరుకాలేనంటూ ఇవాళ ఓ లేఖ రాశారు ఆయన. తన తల్లి బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో ఈడీని కోరారు రాహుల్‌ గాంధీ(51).

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో.. రాహుల్‌ గాంధీ పాత్రపై అనుమానాలు ఏమిటో ఈడీ ఇప్పటిదాకా స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ, మూడు రోజులు పాటు మాత్రం ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు ఈ చర్యకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. అయితే ఈడీ విచారణకు గురువారం బ్రేక్‌ పడింది. తిరిగి శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలంటూ కోరింది ఈడీ. 

తన తల్లి(సోనియా గాంధీ) కరోనాతో చికిత్స పొందుతున్నందునా.. విచారణకు హాజరుకాలేనని, తన తల్లి బాగోగులు చూసుకోవడానికి కొన్ని రోజులు విచారణను పొడిగించాలని లేఖలో కోరారు రాహుల్‌. అయితే ఈడీ ఆ విజ్ఞప్తిపై స్పందించాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ కూడా నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. కరోనా కారణంగా హాజరుకాలేకపోయిన ఆమె.. చికిత్స కోసం గంగారాం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం సోనియాగాంధీ కొడుకు కూతురు రాహుల్‌, ప్రియాంక వాద్రాలు గంగారాం ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు