పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ ఖాళీ.. టీఎంసీలో చేరిన ఏకైక ఎమ్మెల్యే

29 May, 2023 16:38 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బేరాన్‌ బిస్వాస్‌ సోమవారం అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. పశ్చిమ మెదినీపూర్‌ జిల్లాఆలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. 

కాగా ముర్షిదాబాద్ జిల్లాలోని మైనార్టీల ప్రాబల్యం ఉన్న సాగర్‌డిఘి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బేరాన్‌ బిస్వాస్‌.. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక శాసన సభ్యుడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సాగర్‌డిఘీ ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థిపై దేబాశిష్ బెనర్జీపై 22 వేల ఓట్ల మెజార్టీతో  విజయం సాధించాడు. తాజాగా ఆయన కూడా పార్టీ మారడంతో రాష్టంంలో హస్తం పార్టీ ఖాళీ అయ్యింది.

బైరాన్‌ చేరిక అనంతరం టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. బిస్వాస్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ల కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకంగా కేవలం టీఎంసీ మాత్రమే పోరాడగలదని పేర్కొన్నారు. కాషాయ పార్టీ విభజన, వివక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సరైన వేదికను ఎంచుకున్నారని తెలిపారు. కలిసి కట్టుగా పోరాడి గెలుస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా 2021లో జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్‌ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఈ ఏడాది ఉప ఎన్నికలో బిశ్వాస్ కాంగ్రెస్ టిక్కెట్‌పై సాగర్‌డిఘి స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఆయన ఉన్నారు.
చదవండి: ఆందోళన వద్దు.. ఆర్టీసీ బస్సుల్లో రూ. 2 వేల నోట్లకు ఓకే

మరిన్ని వార్తలు