కాంగ్రెస్‌కు భంగపాటు‌: ఏడాదిలో రెండో ప్రభుత్వం

22 Feb, 2021 17:39 IST|Sakshi

కాంగ్రెస్‌ నుంచి చేజారిన మరో ప్రభుత్వం

హస్తం చేతిలో కేవలం ఐదు రాష్ట్రాలే

హైదరాబాద్‌: జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ‌ పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఇప్పటికే లోక్‌సభలో ఉనికి కోల్పోయే స్థితిలో ఉన్న హస్తం పార్టీ ఇప్పుడు తన చేతిలో ఉన్నరాష్ట్రాలను కూడా చేజార్చుకుంటోంది. బీజేపీ వ్యూహాలకు తట్టుకోలేక కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. ఏడాది వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కాంగ్రెస్‌ నుంచి బీజేపీ లాక్కుంది. పుదుచ్చేరి పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాకే తగిలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ మూడు రాష్ట్రాల్లో (పంజాబ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌) అధికారంలో ఉండగా.. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం (మహారాష్ట్ర, జార్ఖండ్‌)లో భాగస్వామిగా ఉంది.

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టింది. అయితే బీజేపీ వేసిన రాజకీయ బాణాలకు కాంగ్రెస్‌ చతికిలి పడి ఇప్పుడు బలం నిరూపించుకోలేక ప్రభుత్వాన్ని కోల్పోయింది. గతంలో మధ్యప్రదేశ్‌లో ఇలాంటి రాజకీయమే జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించారు. వారి రాజీనామాలతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. 2020 మార్చ్‌ 20న ఈ పరిణామం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన15 నెలల్లోనే కూలిపోయింది.

ఏడాది తిరగకముందే ఇప్పుడు పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ అధికారంలో కోల్పోయింది. ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో బలం నిరూపించుకోలేక నారాయణస్వామి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. 2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. నాలుగున్నరేళ్ల పాలన సాఫీగానే సాగింది. అయితే గతేడాది ఎమ్మెల్యే ధనవేల్‌ తిరుగుబాటు నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తుండడంతో చివరకు ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చింది.

అంతకుముందు కర్నాటకలో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయగా బీజేపీ పాచికలకు కుప్పకూలిన విషయం తెలిసిందే. గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసి చివరకు ఏర్పాటు చేయలేదు. ఇక కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కీలక రాష్ట్రం రాజస్థాన్‌లో కూడా పరిస్థితులు సక్రమంగా లేవు. అసంతృప్తులు భగ్గుమంటూనే ఉన్నాయి. సచిన్‌ పైలెట్‌, ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ మధ్య విబేధాలతో ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్‌ ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే రాజస్థాన్‌ కూడా చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది.

చదవండి: మోదీకి చురక:‍ పెట్రోల్‌ ధరలపై బావమరుదుల భగ్గు

మరిన్ని వార్తలు