విమానం నుంచి దించేసి మరీ పవన్‌ ఖేరా అరెస్ట్‌! ప్రధాని మోదీపై వ్యాఖ్యల ఎఫెక్ట్‌

23 Feb, 2023 15:17 IST|Sakshi

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇవాళ పెద్ద పొలిటికల్‌ హైడ్రామా నడిచింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేరా అరెస్ట్‌ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. గురువారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌) బయల్దేరిన ఆయన్ని.. సినీ ఫక్కీలో అరెస్ట్‌ చేశారు అసోం పోలీసులు. విమానం నుంచి దించేసి మరీ.. రెండు గంటల పాటు ఆగి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌ను ఖండిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్‌ పార్టీ.

పవన్‌ ఖేరా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి. రాయ్‌పూర్‌లో జరగబోయే ఏఐసీసీ ప్లీనరీ కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇండిగో విమానంలో బయలుదేరాల్సి ఉంది. ఇంతలో సడన్‌ ఎంట్రీ ఇచ్చిన అసోం పోలీసులు.. ఆయన్ని విమానం నుంచి దించేశారు. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న సీనియర్లు అడ్డుకునే యత్నం కూడా చేశారు.   ఆపై రెండు గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ కాపీ చూపించి అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ.. సుమారు 50 మందికి పైగా కాంగ్రెస్‌ నేతలు విమానం టేకాఫ్‌ కానివ్వకుండా అడ్డుకుంటూ నిరసనకు దిగారు. బోర్డింగ్‌ పాస్‌ ఉన్న అరెస్ట్‌ చేశారంటూ ఆందోళన చేపట్టారు.

ఇక పోలీసులు తీసుకెళ్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తొలుత పోలీసులు వచ్చి మీ బ్యాగేజీతో సమస్య అని చెప్పారు. కానీ, నేను ఒక హ్యాండ్‌ బ్యాగ్‌తో మాత్రమే బయల్దేరాను. అందుకే అనుమానం వచ్చింది. ఆపై వాళ్లు మీరు విమానంలో ప్రయాణించలేరు. డీసీపీ వచ్చి మిమ్మల్ని కలుస్తారు అంటూ చెప్పారు. చాలా సేపు ఎదురుచూసినా ఆయన రాలేదు అని ఖేరా తెలిపారు. చివరకు పోలీసులు ఆయన్ని వ్యాన్‌ ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ పరిణామంపై కాంగ్రెస్‌ సీనియర్‌ కేసీ వేణుగోపాల్‌(అరెస్ట్‌ సమయంలో ఆయన కూడా పవన్‌ వెంట ఉన్నారు) ట్వీట్‌ చేశారు. మోదీ ప్రభుత్వం గూండా రాజ్యంగా వ్యవహరిస్తోందని, పవన్‌ఖేరాను బలవంతంగా నోరు మూయించే సిగ్గుమాలిన చర్యకు దిగిందని విమర్శించారాయన. అలాగే.. పార్టీ మొత్తం పవన్‌కు అండగా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు ఇది సుదీర్ఘ పోరాటమని, దేనికైనా సిద్ధమంటూ పవన్‌ ఖేరా ప్రకటించారు. 

ఆ కామెంట్‌తో మొదలు.. 
ఇదిలా ఉంటే.. పవన్‌ ఖేరా తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో హిండెన్‌బర్గ్‌-అదానీ అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో.. పీవీ నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి జేపీసీ(జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ)లపై అభ్యంతరం లేనప్పుడు.. నరేంద్ర గౌతమ్‌ దాస్‌.. క్షమించాలి..(పక్కనే ఉన్న ఓ నేతను అడిగి మరీ) దామోదర్‌దాస్‌ మోదీ ఎందుకు ఇబ్బందిగా ఫీలవుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆపై ‘పేరేమో దామోదర్‌దాస్‌, పని మాత్రం గౌతమ్‌దాస్‌(అదానీని ఉద్దేశిస్తూ..) కోసం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ప్రధాని మోదీ తండ్రి ప్రస్తావన తెచ్చి మరీ పవన్‌ ఖేరా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది.

పవన్‌ ఖేరాతో పాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా క్షమాపణలు తెలియజేయాలని బీజేపీ మండిపడుతోంది. ఈ మేరకు నిరసన ప్రదర్శనలు కూడా కొనసాగించింది. మరోవైపు ఆయనపై పలువురు బీజేపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. 

మరిన్ని వార్తలు