‘హస్త’వ్యస్తం.. చివరికి మిగిలింది ఆ ‘రెండే’..

10 Mar, 2022 18:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రాభవం రోజురోజుకూ మసకబారుతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమినే మూటగట్టుకుంటోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలబడింది. తాజాగా పంజాబ్‌ను చేజార్చుకుంది. 2012లో దేశంలో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమయ్యింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నిరాశ నెలకొంది. ప్రసుత్తం దేశంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. 

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా జరిగిన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్ మణిపూర్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ ఆశించిన  ఫలితాలను దక్కించుకోలేదు.

నిలబెట్టుకోవడం కష్టమైందా?
2004లో  దేశంలో మధ్యప్రదేశ్, ఒడిశా, మిజోరం రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. 2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా పలు రాష్ట్రాల్లో  అధికారం చేపట్టింది. అయితే పదేళ్ల పాలన తర్వాత ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. 2014 తర్వాత  జాతీయస్థాయిలో పట్టు కోల్పోయిన హస్తం పార్టీ రాష్ట్రాల్లోనూ అదే తోవలో నడిచింది.

2014 సాధారణ ఎన్నికల్లో  కీలకమైన మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటమి చెందింది. 2016 ఎన్నికల్లో కేరళ, అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో అధికారం కోల్పోయింది. 2017లో పంజాబ్‌లో అధికారంలోకి రాగా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓటమి పాలైంది. 2018లో మిజోరం, మేఘాలయా రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ పరాజయం పాలైంది. 2021 ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పుదుచ్చేరి, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్‌లో ప్రభావం చూపించలేకపోయింది. 

ఇక ఆ రెండే ‘చేతి’లో..
2014లో భారతీయ జనతా పార్టీ చేతిలో కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 282 దక్కించుకుని బీజేపీ తొలిసారి సొంతంగా మెజారిటీ సాధించింది. అనూహ్యమైన ఈ అపజయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధిగమిస్తుందనీ, మళ్లీ పుంజుకుంటుందనీ చాలామంది ఊహించారు. కానీ 2019 ఎన్నికల్లో మరోసారి భంగపాటుకు గురైంది. ఒక్కటొక్కటిగా రాష్ట్రాలు హస్తం చేజారిపోగా.. తాజాగా పంజాబ్‌లో కూడా అధికారం కోల్పోయింది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మాత్రమే మిగిలాయి. 

మరిన్ని వార్తలు