కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

29 Aug, 2022 08:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక తేదీపై ఊహాగానాలకు తెరపడింది. అక్టోబర్‌ 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ తర్వాత రెండు రోజుల్లో విజేత పేరును ప్రకటించనున్నట్లు తెలిపాయి. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నాయి. పార్టీ నూతన సారథి ఎన్నిక కోసం సెప్టెంబర్‌ 22న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.

సెప్టెంబర్‌ 24 నుంచి 30 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ చెప్పారు. అక్టోబర్‌ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 8. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే అక్టోబర్‌ 17న ఎన్నిక నిర్వహిస్తారు. అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు విజేత పేరును ప్రకటిస్తారు. ఎన్నిక షెడ్యూల్‌కు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు.

వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సోనియా వెంట కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా ఉన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నిక కోసం చివరిసారిగా 2000 నవంబర్‌లో ఎన్నిక నిర్వహించారు. సోనియా గాంధీ మధ్యలో రెండేళ్లు(2017–2019) మినహా 1998 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈసారి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీని ఎన్నుకోవడంపై సీడబ్ల్యూసీ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది.    

చదవండి: (ఆ ప్రాంతాల్లో రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే: ఎంపీ కోమటిరెడ్డి)

మరిన్ని వార్తలు