క్షమాపణ చెప్పినా.. సీఎం పదవి నుంచి గెహ్లాట్‌కు ఉద్వాసన!

29 Sep, 2022 16:00 IST|Sakshi

రాజస్థాన్‌ అధికార రాజకీయంలో మరో కీలక మలుపు చోటు చేసుకోబోతోందా?. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటును కాంగ్రెస్‌ అధిష్టానం బాగా సీరియస్‌గా తీసుకుందా?.. అడ్డుకోని ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను తప్పించే ప్రయత్నం చేయనుందా?. కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడంతో.. అవుననే చర్చ ఊపందుకుంది.  

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి వైదొలిగినట్లు ప్రకటించి.. ఉత్కంఠకు తెర దించారు 71 ఏళ్ల అశోక్‌ గెహ్లాట్‌. రాజస్థాన్‌లో తాజాగా జరిగిన పరిణమాలు తనను ఎంతో బాధించాయని, అధిష్టానానికి క్షమాపణలు చెప్పానని మీడియాకు వెల్లడిస్తూనే.. అధ్యక్ష రేసులో లేనంటూ పేర్కొన్నారు. అయితే.. క్షమాపణలు తెలిపినా.. ఆయన వివరణతో అధిష్టానం సంతృప్తి చెందలేదని సమాచారం.

తిరుగుబాటులో గ్లెహ్లాట్‌ ప్రమేయం లేదని రాజస్థాన్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్‌ మాకెన్‌ ఇచ్చిన నివేదికలోనూ ‘క్లీన్‌చిట్‌’ దక్కినా.. అనుచరులను కట్టడి చేయలేకపోయారనే కోణంలో అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. అందుకే అధ్యక్ష రేసులో పోటీ నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ముందు రాజస్థాన్‌ సీఎంగా కొనసాగింపు కష్టమేనని సోనియాగాంధీ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

కల చెదిరింది!
రెంటికీ చెడిన రేవడి చందాన తయారయ్యింది ఇప్పుడు అశోక్‌ గెహ్లాట్‌ పరిస్థితి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఈయన.. కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో నిలవాలని భావించారు. అందుకు అధిష్టానం కూడా మద్దతు ఇవ్వాలనుకుంది. అయితే ఒకేసారి జోడు పదవుల్లో కొనసాగాలని ఆయన ఆశపడ్డారు. కానీ, ఉదయపూర్‌ కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో ‘ఒకే వ్యక్తి-ఒకే పదవి’ తీర్మానానికి ఆమోదం తెలిపింది. అలాంటప్పుడు గెహ్లాట్‌ రెండు పదవుల్లో కొనసాగడం కుదరదని ముందుగానే ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టంగా పేర్కొన్నారు. 

దీంతో.. తన అనుచరుడిని రాజస్థాన్‌ సీఎంగా ఎన్నుకుని.. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలని, కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని భావించారు గెహ్లాట్‌. దీంతో ఆయనకు ఆప్తుడైన స్పీకర్‌ సీపీ జోషికి ఆ బంపరాఫర్‌ దక్కుతుందని అంతా భావించారు. అయితే గెహ్లాట్‌కు అధిష్టానం ఆ అవకాశం ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ను రేసులో ముందు నిల్చొబెట్టడంతో.. గెహ్లాట్‌ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సీఎం ఎన్నిక కోసం అజయ్‌ మాకెన్‌ అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి సైతం డుమ్మా కొట్టి.. దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు వేరుగా భేటీ కావడం, అందులో పీసీసీ చీఫ్‌ కూడా ఉండడంతో పరిణామాలు రసవత్తరంగా మారాయి. 

పైలట్‌ తిరుగుబాటు మర్చిపోయారా?
సచిన్‌ పైలట్‌ 2020 సంవత్సరంలో తిరుగుబాటు ప్రయత్నం చేశారు. అయితే.. అది విఫలమైంది. అలాంటప్పుడు.. పైలట్‌ను ఇప్పుడు సీఎంగా ఎలా చేస్తారని గెహ్లాట్‌ వర్గం అధిష్టానాన్ని నేరుగా ప్రశ్నించింది తిరుగుబాటు వర్గం. అంతేకాదు.. ఆ సమయంలో పార్టీ అధికారం కోల్పోకుండా నిలిపిన వ్యక్తుల్లో ఒకరిని సీఎంగా ఎన్నుకోవాలని తీర్మానం చేయడం, ఆపై స్పీకర్‌కు మూకుమ్మడి రాజీనామాల సమర్పణతో.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ కల్లోలం మరో మలుపు తిరిగింది. 

ఆ మాత్రం చేయలేరా?
పరిస్థితి చేయి దాటిపోతుండడంతో రంగంలోకి దిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. ముందుగా గెహ్లాట్‌కు ఫోన్ చేసి తిరుగుబాటు పరిణామాలపై ఆరా తీశారు. అయితే, ఆ సమయంలో గెహ్లాట్‌ ఇచ్చిన సమాధానం అగ్నికి ఆజ్యం పోసింది. అప్పటికే అధిష్ఠానం ఆయన మీద గుర్రుగా ఉండగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారాయన. ‘‘ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారని, తానేమీ చేయలేన’’ని ఆయన చేతులెత్తేయడంతో .. ఈ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్‌ సీరియస్‌గా తీసుకుంది. 

పని చేసిన సీనియర్ల ఒత్తిడి!
క్షమాపణ చెప్పినా అధ్యక్ష ఎన్నికకు ఆయన్ని దూరం చేయడంతో.. గెహ్లాట్‌ వైఖరి పట్ల అధిష్టానం ఏమేర ఆగ్రహంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘‘పార్టీ అధిష్టానానికి క్షమాపణలు తెలియజేస్తున్నా. పార్టీలో తలెత్తిన అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. నేను సీఎంగా ఉండాలో లేదో సోనియా నిర్ణయిస్తారు’’ అంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు గెహ్లాట్‌. సోనియా నిర్ణయం వెనుక సీనియర్ల ఒత్తిడి కూడా ఉందని తెలుస్తోంది. 

తిరుగుబాటు అనంతరం.. అశోక్‌​ గెహ్లాట్‌ను కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ అధినేత్రి(తాతాల్కిక) సోనియా గాంధీపై ఒత్తిడి తెచ్చారు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోని కొందరు సభ్యులు. ఆయన్ని తప్పించి..ఆ స్థానే విధేయంగా ఉండే వేరే ఎవరినైనా ఎంపిక చేయాలంటూ కోరారు వాళ్లు. ‘‘ఆయన మీద నమ్మకంతో.. బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం సరికాదని సోనియాకు సూచించారు వాళ్లు. ఎమ్మెల్యేలను నియంత్రించకుండా.. తెర వెనుక ఉంటూ ఆయన డ్రామాలు ఆడిస్తున్నారంటూ కొందరు సభ్యులు ఆరోపణలు గుప్పించారు కూడా​. ఈ నేపథ్యంలో.. సీనియర్ల అభిప్రాయాలను సైతం సోనియా గాంధీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నా.. ముఖ్యమంత్రిగా గెహ్లాట్ కొనసాగింపు కష్టమే అనే సంకేతాలు పంపింది కాంగ్రెస్‌ అధిష్టానం. వచ్చే ఏడాది రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో.. గెహ్లాట్‌ను మార్చేసి ఆ స్థానంలో మరొకరిని సీఎంగా నియమిస్తారా? లేదా? అనేది త్వరలోనే సోనియాగాంధీ తీసుకునే స్పష్టమైన నిర్ణయం ద్వారా వెల్లడి కానుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

మరిన్ని వార్తలు