తొలిరోజే ఉపసంహ‘రణం’

26 Nov, 2021 06:13 IST|Sakshi

సాగు చట్టాలపై కాంగ్రెస్‌ డిమాండ్‌

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం

న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాలను పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తొలిరోజే ఉపసంహరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నిర్ణయించింది. అలాగే కోవిడ్‌–19 మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని తీర్మానించింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

మల్లికార్జున ఖర్గే, ఆనంద్‌ శర్మ, జైరాం రమేశ్, అధిర రంజన్‌ చౌదరి, గౌరవ్‌ గొగోయ్, కె.సురేశ్, మాణిక్కం ఠాగూర్, రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సాగు చట్టాలను పార్లమెంట్‌ సమావేశాల్లో తొలి రోజే రద్దు చేసేలా పట్టుబట్టాలని నిర్ణయించారు. పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్దత కల్పించాలని ఉభయ సభల్లో డిమాండ్‌ చేస్తామని కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. లఖీమ్‌పూర్‌ ఖేరి ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రాను అరెస్టు చేయాలన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. డిమాండ్ల సాధనకు ఇతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు