చైనా దురాక్రమణపై చర్చించాల్సిందే

17 Dec, 2022 06:00 IST|Sakshi

రాజ్యసభలో కాంగ్రెస్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ, చైనా దురాక్రమణపై చర్చించాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ శుక్రవారం రాజ్యసభలో డిమాండ్‌ చేసింది. ఉదయం సభ ప్రారంభం కాగానే పార్టీ ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. వెల్‌లో బైఠాయించారు. దాంతో సభ 25 నిమిషాలు వాయిదా పడింది. తర్వాత కూడా చర్చకు విపక్షాలిచ్చిన నోటీసులను ఆమోదించాలని, ఇతర కార్యకలాపాలను పక్కనపెట్టి చైనా దురాక్రమణపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్‌ ఎంపీలు పట్టుబట్టారు. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశంపై చట్టసభలో చర్చించకపోవడం ఏమిటని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. జీరో అవర్‌ను ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రకటించడంతో ఎంపీలు నినాదాలకు దిగారు. దాంతో సభ వాయిదా పడింది.

లోక్‌సభలో కీలక అంశాల ప్రస్తావన   
రోడ్ల అనుసంధానం, అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్‌ జాబితా, కేంద్ర పథకాలకు నిధులు, కాలుష్యం వంటి కీలకాంశాలను లోక్‌సభలో శుక్రవారం పలు పార్టీల సభ్యులు ప్రస్తావించారు. పెన్షన్లు, రిటైర్మెంట్‌ ప్రయోజనాల  విషయంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శివసేన ఎంపీ వినాయక్‌ రౌత్‌ కోరారు. కొన్ని రాష్ట్రాల్లో ఆయుష్మాన్‌ భారత్‌–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దుర్వినియోగం అవుతోందని బీజేపీ సభ్యుడు సుదర్శన్‌ భగత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు