మోదీ స్టేడియం పేరును మారుస్తాం! మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ

12 Nov, 2022 14:51 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే అహ్మాదాబాద్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియం పేరును మారుస్తానని కాంగ్రెస్‌ హామీ ఇస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ రాబోయే అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేస్తూ అందులో... సుమారు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేగాదు అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం పేరును సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ స్టేడియంగా మారుస్తానని చెప్పింది.

ఈ మేరకు రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తొలి క్యాబినేట్‌ సమావేశంలోనే కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోను అధికారికంగా అమలు చేసే ప్రయత్నం చేస్తాం అని నొక్కి చెప్పారు. అలాగే మహిళలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ. 2000 చొప్పున మంజూరు చేస్తామని పేర్కొన్నారు. సుమారు 3 వేల ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, పైగా బాలికలకు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు ఉచిత విద్యను అందిస్తామని పార్టీ తెలిపారు.

అంతేగాదు దాదాపు రూ. 3లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలవారీ రూ. 3 వేల జీవన భృతి, 500 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం అంటూ మ్యానిఫెస్టోని విడుదల చేశారు. గుజరాత్‌లోని ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి బాధ్యత వహిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అదే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే గత 27 ఏళ్లలో అవినీతికి సంబంధించిన అన్ని ఫిర్యాదులను సేకరించి దోషులపై కేసులు నమోదు చేస్తామని గెహ్లాట్‌ చెప్పారు. ఐతే గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

(చదవండి: బీజేపీ కార్యకర్తల పోరాటం అభినందనీయం.. నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ..: ప్రధాని మోదీ)

మరిన్ని వార్తలు