రాజధర్మాన్ని పాటించాలి: కాంగ్రెస్‌

5 Sep, 2020 18:02 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే దేశ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిథి రన్‌దీప్‌ సుర్జీవాలా తెలిపారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ దృష్టి పెట్టాలని కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక సమస్యలపై చర్చలు జరిపేటప్పుడు ప్రజలకు వివరించడం రాజధర్మమని పేర్కొన్నారు. చైనాతో విదేశాంగశాఖ జరిపిన చర్చల విషయాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. చర్చల తర్వాత కూడా ఇప్పటికీ డ్రాగన్‌ దూకుడుగా వ్యవహరిస్తుండడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మండిపడ్డారు.

అయితే చర్చలకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని, కానీ ఆ చర్చల సారాంశాన్ని స్సష్టంగా ప్రజల ముందుంచాలనేదే తమ ఏకైక డిమాండ్‌ అని రన్‌దీప్‌ సుర్జీవాలా పేర్కొన్నారు. కాగా ఇటివల షాంఘై సహకార సంస్థ( ఎస్‌ఓసీ) మంత్రుల స్థాయి సమావేశంలో సరిహద్దు అంశాన్ని రాజ్‌నాథ్‌సింగ్‌ లేవనెత్తారు. అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మధ్య దాదాపు రెండు గంటల పాటు భేటీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం చైనాతో జరుపుతున్న చర్చల నేపథ్యంలో కాంగ్రెస్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. (చదవండి: దురాక్రమణ దుస్సాహసం)

మరిన్ని వార్తలు