మేలు జరిగిన వారు రుణం తీర్చుకోండి.. సోనియా కీలక వ్యాఖ‍్యలు

10 May, 2022 06:35 IST|Sakshi
భేటీలో పాల్గొన్న సోనియా, రాహుల్‌

కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌పై సోనియా

పార్టీ కష్టకాలంలో ఉంది.. నిలబెట్టుకుందాం

సవాళ్లను ఎదుర్కొనేలా బలోపేతం చేద్దాం

సీడబ్ల్యూసీ భేటీలో సీనియర్లకు దిశానిర్దేశం

సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న చింతన్‌ శిబిర్‌ తప్పనిసరి తంతుగా మారటానికి వీల్లేదని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల సవాళ్లను, సైద్ధాంతిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పార్టీ తిరిగి జవసత్వాలు కూడదీసుకోవాలి. అట్టడుగు స్థాయి నుంచి పటిష్టంగా పునర్నిర్మాణం జరగాలి. చింతన్‌ శిబిర్‌ అందుకు వేదిక కావాలి. పార్టీపరంగా చేపట్టాల్సిన చర్యలతో పాటు చేయాల్సిన మార్పుచేర్పులు తదితరాలను ప్రతి ఒక్కరూ నిర్మొహమాటంగా వెల్లడించాలి.

కష్టకాలాన్ని దాటింటి పార్టీని అమేయ శక్తిగా మార్చాలి. మీరంతా చిత్తశుద్ధితో శాయశక్తులా కృషి చేస్తేనే అది సాధ్యం’’ అని సీనియర్‌ నేతలకు సూచించారు. కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. రెండు గంటల పాటు జరిగిన భేటీలో సీనియర్లను ఉద్దేశించి సోనియా మాట్లాడారు.

ఒక్క రోజులోనే సమస్యలన్నింటినీ పరిష్కరించే మంత్రదండమేదీ లేదని, క్రమశిక్షణ, నిస్వార్థంగా కష్టించే గుణం, సమష్టి కృషి ద్వారానే ఏదైనా సాధ్యమని ఉద్బోధించారు. ‘‘మనలో ప్రతి ఒక్కరి జీవితాలకూ కాంగ్రెస్‌ పార్టీయే జీవనాధారం. ఇంతకాలంగా మనందరి బాగోగులూ చూసుకుంటూ వచ్చిన పార్టీ రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయమిది. కష్టకాలంలో ఉన్న పార్టీని తిరిగి బలోపేతమైన శక్తిగా నిలబెట్టాలి’’ అని పిలుపునిచ్చారు.

స్వీయ విమర్శ ఉండాలి గానీ...
రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 13 నుంచి 15 దాకా జరిగే చింతన్‌ శిబిర్‌లో 422 మంది సభ్యులు పాల్గొంటారని సోనియా వివరించారు ‘‘పార్టీ వేదికలపై స్వీయ విమర్శ అవసరమే. కానీ అది ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. సవాళ్లన్నింటినీ కలసికట్టుగా అధిగమిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఇదంతా జరగాలంటే చింతన్‌ శిబిర్‌ నామ్‌ కే వాస్తే ప్రహసనంలా మారకూడదన్నారు.  చింతన్‌ శిబిర్‌లో  తీర్మానాలకు సీడబ్ల్యూసీ అంగీకారం అనంతరం మే 15న ‘ఉదయ్‌పూర్‌ నవ్‌ సంకల్ప్‌’ పేరుతో ఆమోదం లభిస్తుందని వివరించారు.

సభ్యుల్లో 21 శాతం మహిళలు
సీడబ్య్లూసీ భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా మీడియాకు వివరించారు. ‘‘చింతన్‌ శిబిర్‌లో పాల్గొనే 422 మంది సభ్యుల్లో సగం మంది 50 ఏళ్లలోపువారే. మహిళలు 21 శాతం’’ అని చెప్పారు.

హాజరవని ప్రియాంక, మన్మోహన్‌
సీడబ్ల్యూసీ భేటీకి ప్రియాంక గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ హాజరవలేదు.  ఆజాద్, ఆనంద్‌ శర్మ, భూపేంద్ర సింగ్‌ హుడా, కేసీ వేణుగోపాల్, ఖర్గే, ముకుల్‌ వాస్నిక్, అంబికా సోని, అధిర్‌ రంజన్, అశోక్‌ గెహ్లాట్, భూపేశ్‌ బఘేల్‌ పాల్గొన్నారు.  
 

ఇది కూడా చదవండి: చిక్కుల్లో నవనీత్‌ కౌర్‌ దంపతులు.. బెయిల్‌ రద్దయ్యే చాన్స్‌! కారణం ఏంటంటే..

మరిన్ని వార్తలు