గుజరాత్‌ ఉప్పును పొగిడిన రాష్ట్రపతి.. ‘చెంచాగిరి’ అంటూ సంచలన ట్వీట్లు

6 Oct, 2022 12:52 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ సంచలన ప్రకటనలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్లపై బీజేపీ మండిపడుతోంది.

‘‘ద్రౌపది ముర్ముగారి లాంటి వ్యక్తి ఏ దేశానికి కూడా ప్రెసిడెంట్‌ కాకూడదు. చెంచాగిరికి కూడా ఓ హద్దు అంటూ ఉంటుంది. దేశంలో 70 శాతం మంది గుజరాత్‌ నుంచి తయారైన ఉప్పును తింటున్నారని ఆమె చెప్పారు. ఒకవేళ మీ అంతట మీరుగా ఉప్పు తిని బతికితేనేగా.. ఆ విషయం మీకు తెలిసేది’’ అంటూ ఉదిత్‌ రాజ్‌ సంచలన ట్వీట్‌ చేశారు.

 

ఇక ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ, ఉదిత్‌ రాజ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది. ద్రౌపది ముర్ముగారి మీద తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ముర్మూజీని అభ్యర్థిగా చేసి ఆదివాసీ పేరుతో ఓట్లు అభ్యర్థించారు. ఆమె దేశానికి రాష్ట్రపతి మాత్రమే కాదు.. గిరిజనుల ప్రతినిధి కూడా. ఎస్‌సి/ఎస్‌టి పేరుతో పదవులకు వెళ్లి మౌనంగా ఉంటే ఏడుపు వస్తుంది అంటూ మరో ట్వీట్‌ చేశారాయన. 

అక్టోబర్‌ 3న ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. ‘‘భారత దేశం పాల ఉత్పత్తిలో, వినియోగంలో మొదటిస్థానంలో ఉంది. శ్వేత విఫ్లవం అనేది గుజరాత్‌ నుంచే మొదలైంది. అంతెందుకు గుజరాత్‌లో తయారైన ఉప్పునే దేశంలో 76 శాతం మంది తింటున్నారు. కాబట్టి.. గుజరాత్‌ ఉప్పునే దేశం మొత్తం తింటోంది అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఉదిత్‌ రాజ్‌ ఇలా తీవ్రంగా స్పందించారు. 

ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. ఉదిత్‌ రాజ్‌ తొలుత బీజేపీలో ఉండేవారు. 2014 నుంచి 2019 మధ్య బీజేపీ తరపున నార్త్‌ వెస్ట్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో.. బీజేపీ ఆయనకు టికెట్‌ నిరాకరించింది. దీంతో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. అప్పటి నుంచి బీజేపీని ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పార్టీగా అభివర్ణిస్తూ విమర్శిస్తూ వస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ లోక్‌సభ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదురీ.. పార్లమెంట్‌ సమావేశాల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి.. రాష్ట్రపత్ని అని సంబోధించడం.. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై అధికార బీజేపీ ఆందోళన చేపట్టగా.. ఎట్టకేలకు ఆయన రాష్ట్రపతి ముర్ముకు క్షమాపణలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు