పెట్రోల్‌ ధరల పెరుగుదల: వివాదంలో నటులు

20 Feb, 2021 19:24 IST|Sakshi

పెరిగిన పెట్రోల్‌ ధరలపై వారు స్పందించాలి 

లేదంటే షూటింగ్‌లను అడ్డుకుంటాం 

బాలీవుడ్‌ నటులకు కాంగ్రెస్‌ హెచ్చరిక 

ముంబై సెంట్రల్ ‌: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటులు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌కుమార్‌లు స్పందించకుంటే వారి సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు నానా పటోలే హెచ్చరించారు. అంతేగాకుండా వారి షూటింగులను కూడా అడ్డుకుంటామన్నారు. డిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున భండార జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా అమితాబ్‌ బచ్చన్, అక్షయ్‌ కుమార్‌లు సోషల్‌ మీడియాలో ‘మేం కార్లయితే కొనగలం కానీ, పెట్రోల్‌ కొనలేం’ అని వ్యంగ్యంగా పలు పోస్టింగ్‌లు పెట్టారనీ, అలాంటిది ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సెలబ్రిటీలు కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజస్వామ్య వ్యవస్థలో ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసే ఇలాంటి సెలబ్రిటీలు ప్రజల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం వారి బాధ్యతగా భావించాలన్నారు. కాగా గడిచిన నెల రోజులుగా దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో తొలిసారి పెట్రోల్‌ ధర లీటర్‌ వంద రూపాయలను దాటింది. భారీగా పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రచారం కోసమే.. 
పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం కోసమే అమితాబ్, అక్షయ్‌కుమార్‌ లాంటి సెలబ్రిటీల పేర్లను వాడుకుంటోందని విమర్శించారు. షూటింగ్‌లను, సినిమా ప్రదర్శనలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో భాగస్వామియే కానీ, రాష్ట్రానికి యజమాని కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ఇలాంటి బెదిరింపుల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావని, ఫలితంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుందని విమర్శించారు.  

మరిన్ని వార్తలు