కాంగ్రెస్‌ కార్యకర్తపై పోలీసుల దాడి.. ఆర్టికల్‌ 19 ప్రకారం స్వేచ్చ ఇదేనా అంటూ..

1 Oct, 2022 19:49 IST|Sakshi

బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో పేసీఎంపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా పేసీఎం అని రాసిన టీషర్ట్‌ ధరించాడనే కారణంగా కాంగ్రెస్‌ కార్యకర్తను పోలీసులు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కర్నాటక పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల ప్రకారం.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకకు చేరుకుంది. ఈ క్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ నేత అక్షమ్‌ కుమార్‌.. జోడో యాత్రలో పాల్గొన్నాడు. కాగా, జోడో యాత్ర సందర్భంగా అక్షయ్‌ కుమార్‌.. పేసీఎం అని రాసిపెట్టి ఉన్న టీషర్ట్‌ను ధరించాడు. దీనిని గమనించిన పోలీసులు.. అక్షయ్‌ కుమార్‌ను పట్టుకున్నారు. టీషర్ట్‌ను బలవంతంగా విప్పించారు. ఈ క్రమంలోనే అక్షయ్‌ కుమార్‌పై ఓ పోలీసు తన పిడికిలితో పంచ్‌లు ఇస్తూ లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక, ఈ వీడియోపై కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ కార్యకర్త విషయంలో పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. అక్షయ్‌ కుమార్‌ టీషర్ట్‌ను తొలగించి దాడి చేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించింది. సదరు పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేసింది. నెటిజన్లు సైతం స్పందిస్తూ కర్నాటక పోలీసులు.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం భావ ప్రకటనా స్వేచ్చను హరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు