జైలు నుంచి రైలు ప్రమాద బాధితులకు రూ.10 కోట్లు విరాళం

16 Jun, 2023 18:39 IST|Sakshi

ఒడిశా: రూ. 200 కోట్లు మనీలాండరింగ్ కేసులో అరెస్టై మాండోలి జైలులో ఊచలు లెక్కబెడుతున్న కరుడుగట్టిన ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మంచివాడిగా మారి ఒడిశా రైలు ప్రమాదంలో బాధితులకు రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు జైలు నుంచే ఒక లేఖ కూడా రాశాడు. 

ఎవరీ సుఖేష్.. 
కోర్టు ధిక్కారణతోపాటు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మాల్విందర్ సింగ్ లకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి వారి భార్యల నుండి సుమారు రూ.200 కోట్లు దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. అయితే తీహార్ జైలులో ఉంటూనే సుఖేష్ ఈ నేరానికి పాల్పడటం ఆశ్చర్యకరం. కేవలం మాటలతోనే మాయ చేయగల ఈ మహా నేరగాడిలో ఉన్నట్టుండి మానవత్వం పరిమళించి రైలు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు.      

ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 1200 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారికి, అనాథలైన పిల్లలకు రూ. 10 కోట్లు ఆర్ధిక సాయం అందించనున్నట్లు సుఖేష్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లేఖ రాశారు. 

లేఖలో ఏమని రాశాడంటే.. 
"నేను పంపిస్తున్న మొత్తం నగదు చట్టబద్ధంగా సంపాదించినది. దీనికి టాక్స్ కూడా కట్టాను. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో పాటు రూ.10 కోట్ల డీడీను కూడా పంపిస్తాను. ఒడిశా రైలు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఎలాగూ అండగా ఉంటుంది. కానీ బాధ్యతగల మంచి పౌరుడిగా నేను కూడా వారికి నా వంతుగా రూ.10 కోట్లు సాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తం సొమ్ము తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు, పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. దయచేసి నా ఈ అభ్యర్ధనను అంగీకరించి విరాళాలు సేకరించే సంబంధిత శాఖ వివరాలను తెలపగలరు." అని రాశాడు.      

మహా నేరగాడు, మానవత్వం, రైలు ప్రమాదం, ఒడిశా రైలు ప్రమాదం, సుఖేష్ చంద్రశేఖర్, చట్టబద్ధం,  ప్రమాద బాధితులు, ప్రభుత్వం

ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త!  

మరిన్ని వార్తలు