corona: పండుగలప్పుడు ఆంక్షలు పెట్టండి! 

5 Aug, 2021 07:55 IST|Sakshi

కరోనా నిబంధనలు పాటించేలా సూచనలు

భౌతిక దూరం, పండుగలప్పుడు  నిబంధనలు

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన 

న్యూఢిల్లీ: కోవిడ్‌19 వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలుగా రాబోయే పండుగల సందర్భంగా స్థానికంగా ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మొహర్రం (ఆగస్టు 19), ఓనం (ఆగస్టు 21), జన్మాష్టమి (ఆగస్టు 30), వినాయక చవితి (సెప్టెంబరు 10), దుర్గా పూజ (దసరా నవరాత్రులు, అక్టోబరు 5-15) లకు జనం గుంపులుగా ఒకేచోట చేరకుండా చూడాలని, స్థానికంగా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కోరారు.

పండుగల సందర్భంగా జనం పెద్దసంఖ్యలో ఒకేచోటికి చేరితే... సూపర్‌ స్ప్రెడర్‌గా అవి మారే అవకాశం ఉంటుందని, కోవిడ్‌ కేసులు పెరిగిపోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. సెకండ్‌ వేవ్‌లో కేసుల వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్రాలు చేసిన కృషిని అభినందించారు. 

మరిన్ని వార్తలు