దమ్ముంటే నా మేనల్లుడిపై పోటీ చేయ్‌

18 Feb, 2021 22:01 IST|Sakshi

అమిత్‌షాకు టీఎంసీ అధినేత్రి, సీఎం మమత సవాల్‌

బెంగాల్‌లో మేనల్లుడి చుట్టూ రాజకీయం

కోల్‌కత్తా: అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు సెగ పుట్టిస్తున్నాయి. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మధ్య విమర్శల జోరు నడుస్తోంది. పరివర్తన్‌ యాత్రలో అమిత్‌ షా మమతా మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ లక్ష్యంగా విమర్శలు చేయగా దానికి మమతా ధీటుగా స్పందిస్తున్నారు. 

తాజాగా తన మేనల్లుడిపై ఆరోపణలు చేస్తున్న అమిత్‌ షాకు సవాల్‌ విసిరారు. దమ్ముంటే నా అల్లుడు అభిషేక్‌ బెనర్జీపై అమిత్‌ షా పోటీ చేయాలని కోరారు. ఆ తర్వాత నాపై పోటీ చేయండి అని సలహా ఇచ్చారు. మొదట అభిషేక్‌ బెనర్జీపై పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్‌ విసిరారు. గురువారం దక్షిణ 24 పరగణాల జిల్లా పైలాన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడారు. రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్నా ప్రజా తీర్పు కోసం తన అల్లుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశాడని వివరించారు. అమిత్‌ షా చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. 

తన అల్లుడిపై విమర్శలు చేసే ముందు మీ కుమారుడు 2019లో చేసిన ఘన కార్యంపై స్పందించాలని మమతా విజ్ఞప్తి చేశారు. బీసీసీఐ కార్యదర్శిగా ఉండి కోట్లాది రూపాయలు దోచుకోలేదా అని ప్రశ్నించారు. అతడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే దమ్ము ఉందా? నిలదీశారు. ఈ విధంగా తృణమూల్‌, బీజేపీ మధ్య విమర్శల వాన కురుస్తోంది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాష్ట్రంలో సెగలు పుట్టిస్తున్నారు.

ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్‌కే: బీజేపీకి సున్నా

పుదుచ్చేరి సంక్షోభం: గవర్నర్‌ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు