స్థలాన్ని ఫ్రీగా ఇచ్చాడు.. కానీ 7నెలలుగా అక్కడే..

18 Nov, 2021 15:03 IST|Sakshi

ఆరోగ్య కేంద్రానికి స్థలం దానం ఇచ్చిన గుమస్తా విభీషన్‌ నాయక్‌ 

7నెలలుగా జీతం అందక పోవడంతో పీహెచ్‌సీకి తాళం వేసి, నిరసన 

సాక్షి,రాయగడ(భువనేశ్వర్‌): జిల్లాలోని కాశీపూర్‌ సమితి కుచేయిపొదొరొ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)కి తాళం పడింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందాలని తలచి, పెద్ద మనసుతో స్థలాన్ని దానంగా ఇచ్చిన దాతే ప్రస్తుతం బాధితుడిగా మారాడు. ఇక్కడే గుమస్తాగా పనిచేస్తున్న ఆయనకు గత 7నెలలుగా వేతనం అందకపోవడంతో విసుగెత్తి, పీహెచ్‌సీకి తాళం వేయడంతో పాటు అక్కడే వంటా–వార్పు చేస్తూ ఆందోళనకు దిగాడు. ఇప్పటికే అంతంత మాత్రంగా వైద్య సౌకర్యాలు ఉన్న ఈ సమితిలో ఈ తరహా సమస్యలు తలెత్తడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొరాగుడ పోలీస్‌ స్టేషన్‌ ఐఐసీ అజిత్‌ స్వొయి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కుచేయిపొదొరొలో పీహెచ్‌సీ నిర్మించాలని స్థానికులు ఎప్పటి నుంచే డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. 2002లో ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసింది. అయితే అనువైన ప్రభుత్వ స్థలం అభించకపోవడంతో అదే గ్రామానికి చెందిన విభీషన్‌ నాయక్‌ తన స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆ స్థలంలో 2003లో పీహెచ్‌సీని ఏర్పాటు చేసి, వైద్య సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన స్థలాన్ని ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన నాయక్‌ను అదే ఆరోగ్య కేంద్రంలో గుమస్తాగా ప్రభుత్వం నియమించింది. అయితే గత కొన్నేళ్లుగా తన ఉద్యోగాన్ని రెగ్యులర్‌ చేయాలని విభీషన్‌ నాయక్‌ ప్రభుత్వానికి నివేదించాడు. సంబంధిత శాఖ అధికారులను కలసి వినతిపత్రాలు కూడా సమర్పించాడు.

మరోవైపు గత 7నెలలుగా వేతనం కూడా చెల్లించక పోవడంతో స్థల దాతే బాధితుడిగా మారాడు. ఈ క్రమంలో అధికారుల తీరుపై విసుగెత్తిన ఆయన.. బుధవారం నాడు తన బంధువులతో కలిసి పీహెచ్‌పీ మెయిన్‌ గేటుకు తాళం వేశాడు. అక్కడే వంట చేస్తూ తన నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, అతనిని బుజ్జగించారు. తాళాలు తెరిచి, సేవలందించేలా చర్యలు చేపట్టారు.

చదవండి: Vijay Shekhar Sharma Emotional: జాతీయ గీతం వింటూ కన్నీరు పెట్టుకున్న విజయ్‌ శేఖర్‌ శర్మ!

మరిన్ని వార్తలు