Contractor Death Case: విచారణ జరుగుతోంది, తొందరెందుకు? విపక్షాలపై సీఎం ఫైర్‌

17 Apr, 2022 13:51 IST|Sakshi

బెంగళూరు:  కే.ఎస్‌ ఈశ్వరప్పను అరెస్ట్‌ చేసేది, లేనిది విచారణ అధికారుల నిర్ణయమని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. ఆయన శనివారం హంపీ సమీపంలోని కన్నడ విశ్వ విద్యాలయంలో నూతన భవనాలను ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి జార్జ్‌పై వచ్చిన ఆరోపణలపై అప్పటి సీఎం ఎందుకు ఆయన్ను అరెస్ట్‌ చేయించలేదని ప్రశ్నించారు.

సీఎల్‌పీ నేత సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకలా మాటలు మాట్లాడితే సరిపోదన్నారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం మంచిది కాదన్నారు.  సంతోష్‌ పాటిల్‌ గదిలో క్రిమిసంహారక మందు దొరకడంతో విచారణ జరుగుతోందన్నారు. కాగా హొసపేటెలో బీజేపీ కార్యనిర్వాహక సభ భారీఎత్తున నిర్వహించారు. మాజీ సీఎం యడియూరప్ప, మంత్రి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 
చదవండి: కర్ణాటక కాంట్రాక్టర్‌ మృతి.. చనిపోయేముందు ఏం జరిగింది?

కాంగ్రెస్‌ హస్తం ఉందేమో ? 
సాక్షి,బళ్లారి/హొసపేట: కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే వారి హస్తం ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిని కుమార్‌ కటిల్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన హొసపేటలో విలేకరులతో మాట్లాడుతూ... సంతోష్‌ ఆత్మహత్య వెనుక మహానాయకుడు హస్తం ఉందని చర్చసాగుతోందని, ఆ దిశగా దర్యాప్తు కూడా చేయిస్తామన్నారు. ఈశ్వరప్పను అరెస్ట్‌ చేయాలని రాద్ధాంతం చేస్తున్నారని, ఎవరిని అరెస్ట్‌ చేయాలో చట్టం చూసుకుంటుందన్నారు.

మరిన్ని వార్తలు